Begin typing your search above and press return to search.

కేసీఆర్.. ఆర్టీసీపై అంత ఇగో ఫీలింగ్ ఎందుకు?

By:  Tupaki Desk   |   14 Oct 2019 5:30 PM GMT
కేసీఆర్.. ఆర్టీసీపై అంత ఇగో ఫీలింగ్ ఎందుకు?
X
ఎలాంటి ఉద్యమాల ద్వారా అయితే తను లబ్ధి పొంది రాష్ట్రాన్ని విడదీయగలిగారో, ఎలాంటి ఉద్యమాల ద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి, జనాలంతా రోడ్ల మీదకు వచ్చేలా చేశారో.. ఇప్పుడు అలాంటి ఉద్యమాలకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఊపిరి పోస్తూ ఉండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అది ఉద్యమ పార్టీ. ఆ ఉద్యమ పార్టీకి ఊపిరి పోసింది శ్రామికులు, కార్మికులు. అలాంటి కార్మిక వర్గాల్లో ఇప్పుడు కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ప్రబలుతూ ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి.

అసలు ప్రతిపక్షాలు కేసీఆర్ మీద కారాలూ మిరియాలూ నూరుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్టీసీ వ్యవహారం వారికి అనుకూలంగా మారుతూ ఉంది. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోయడానికి వారికి అవకాశం ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెను అడ్డుపెట్టుకుని అవి అస్త్రాలు సంధిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కేసీఆర్ అండ్ కో ఎదురుదాడి చేసినా పెద్దగా ప్రయోజనాలు కనిపించేలా లేవు.

అయినా ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఇంత ఇగో ఫీలింగ్ కు ఎందుకు పోతున్నాడు? అనేదే బిగ్ కొశ్చన్ మార్క్. కార్మిల సంఘాలు నిరసన బాట పట్టినప్పుడే వారిని పిలిపించుకుని మాట్లాడాల్సింది. అయితే ఆ సంఘాలతో మాట్లాడేదే లేదని భీష్మించుకున్నారు. ఫలితంగా పరిస్థితి చేయిదాటిపోయింది.

ఇదే సమయంలో శ్రీనివాస రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య కార్మికుల సమ్మెను మండేలా చేస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలోనూ ఆ ప్రాంతంలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వచ్చాకా కూడా అలాంటి ఆత్మహత్యలే నమోదు కావడం విచారకరం. ఇది కేసీఆర్ పై తీవ్రమైన వ్యతిరేకతను పెంచే అంశమే.

ఎన్నికలు ఇప్పుడప్పుడే లేకపోవచ్చు గాక, అయితే మెజారిటీ ప్రజలతో, కార్మిక వర్గాలతో కేసీఆర్ కు ఇక్కడ నుంచినే దూరం పెరిగే అవకాశం ఉంది. అవతల ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారు. అయితే ఆర్టీసీ కార్మికులకు ముల్లుగుచ్చుకుంటే తన పంటి తో తీస్తానంటూ ఉద్యమం సమయంలో ప్రకటించిన వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనానికి సానుకూలంగా కనిపించడం లేదు. సావధానంగా కార్మికుల కోరికలనుకూడా వినేలా లేడు.

ఒకరకంగా నియంతృత్వానికి వెళ్లాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. ప్రజాస్వామ్యంలో - అందునా ఉద్యమ పార్టీలో అలాంటి నియంతృత్వం ఏ మాత్రం పనికి వచ్చే అంశం కాదు. ఇదంతా కేసీఆర్ కు తెలియనది కాకపోవచ్చు. అయినా ఆయన తన ఇగోకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే ఇబ్బంది పడేది కార్మికులే కాదు, సామాన్య ప్రజానీకం అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతుందనే విషయాన్ని తెలంగాణ సీఎం ఎప్పుడు గ్రహిస్తారో మరి!