Begin typing your search above and press return to search.

అఖిలపక్షం మాటను కేసీఆర్ విన్నారా?

By:  Tupaki Desk   |   23 Aug 2016 5:23 AM GMT
అఖిలపక్షం మాటను కేసీఆర్ విన్నారా?
X
కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తోచినట్లుగా.. తనకు ఇష్టం వచ్చినట్లుగానే చేసినట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. కొత్త జిల్లాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ముసాయిదాలో ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాల కోసం విడుదల చేసిన ముసాయిదా ప్రతిని చూస్తే.. కొత్త జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో వచ్చిన వినతుల ఆధారంగా మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు.

పలువురు నేతలు చేసిన వినతుల్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వాటిని మార్చి ముసాయిదాను విడుదల చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త జిల్లాలకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రతులను విడుదల చేశారు. 30 రోజుల గడువులో ప్రజలు తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అనంతరం మరో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయం ఏమీ లేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని చెప్పాలి.

ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటన్న విషయంలో తాను చెప్పిన అంశాలపై తన కమిట్ మెంట్ ను ప్రదర్శించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా పార్టీ నేతలు స్థానికంగా తమకున్న పట్టుతో సూచించిన అన్ని మార్పులపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లుగా కనిపిస్తోంది. లేనిపోని వివాదాలకు తావివ్వకూడదని.. అందరిని కలుపుకుపోయామన్న భావన కలిగించేందుకు కొన్ని అంశాల్లో వెనక్కి తగ్గినట్లుగా కూడా చెబుతున్నారు. అఖిలపక్షంలో వచ్చిన సూచనల విషయంలో సానుకూలంగా స్పందించని పక్షంలో లేనిపోని తలనొప్పులకు అవకాశం ఉండటంతో.. రాజకీయ రచ్చకు అవకాశం లేకుండా చేయాలన్న భావన స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. కొత్త జిల్లాలపై అఖిలపక్షంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సూచనల్ని మార్చటాన్ని ప్రస్తావిస్తున్నారు. అలా మార్పులు కొన్నింటిని చూస్తే..

= హైదరాబాద్ జిల్లాను యథాతథంగా కొనసాగించాలని మజ్లిస్ కోరింది. అందుకు తగ్గట్లే సీఎం సానుకూలత కారణంగా హైదరాబాద్ జిల్లాలో మార్పులు జరగలేదు.

= నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలాన్నిమెదక్జిల్లాలో కలపటంపై శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగిరెడ్డి పేట.. ఎల్లారెడ్డి మండలాల మధ్య పెద్ద చెరువు ఉందని.. మండలాల్ని మార్చి వేర్వేరుజిల్లాల్లోకి చేరిస్తే లేనిపోని నీటి వివాదాలు వస్తాయన్న సూచనను ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండు మండలాల్ని కామారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు.

= ఇదే తరహాలో కాంగ్రెస్.. టీడీపీ.. వామపక్ష నేతలు ఇచ్చిన పలు సూచనల్ని ముసాయిదా ప్రతిలో మార్పులు చేసి విడుదల చేశారు.