Begin typing your search above and press return to search.

ఓటుకు నోటును వదిలేసినట్లేనా!?

By:  Tupaki Desk   |   3 July 2015 5:30 PM GMT
ఓటుకు నోటును వదిలేసినట్లేనా!?
X
ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం వదిలేసినట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం చేసిన వ్యాఖ్యలతో ఈ సందేహాలు బలపడుతున్నాయి. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత జరిపిన ర్యాలీలో సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆయనను గద్దె దించే వరకూ పోరాడతానని సవాల్‌ చేయడమే కాకుండా కేసీఆర్‌ శైలిలోనే తిట్ల దండకం అందుకున్నారు. గురువారం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దాంతో, ''అదో పిచ్చివాడి కథ. వదిలేయండి'' అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పోలవరం ముంపు మండలాల విషయంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తెలంగాణవాదులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన తొలి కేబినెట్‌ సమావేశంలో ముంపు మండలాలపై ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అప్పట్లో విలేకరులు ముంపు మండలాలపై కేసీఆర్‌ను ప్రశ్నించారు. దాంతో, అది ముగిసిన అధ్యాయం.. వదిలేయండి అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ముంపు మండలాల విషయానికి, రేవంత్‌ రెడ్డికి సంబంధం లేకపోయినా రెండు సందర్భాల్లోనూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తెలంగాణవాదులు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్‌ ఇక ఏ అంశాన్ని అయినా వదిలేయాలని నిర్ణయించుకుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని, దాంతో ఓటుకు నోటుకు కూడా చాప చుట్టేసినట్లేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.