Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌కు కూడా స‌ర్కారులో విలువేలేద‌ట‌

By:  Tupaki Desk   |   29 Dec 2017 8:50 AM GMT
కేసీఆర్ మాట‌కు కూడా స‌ర్కారులో విలువేలేద‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాటే...ఇటు ఆయ‌న సార‌థ్యంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితిలో అటు ముఖ్య‌మంత్రిగా ఉన్న తెలంగాణ స‌ర్కారులో శాస‌న‌మ‌నే సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే కేసీఆర్ మార్క్ రాజ‌కీయం అలా ఉంటుంది మ‌రి! కానీ అదేమీ న‌డ‌వ‌డం లేదంటే...అందులోనూ తెలంగాణ‌లో ఆ ప‌రిస్థితి లేదంటే..కేసీఆర్ మాటంటే లైట్ తీసుకుంటున్నారంటే..న‌మ్ముతారా? న‌మ్మ‌లేరు కానీ...నిజంగా అదే జ‌రుగుతోంది.

ఒక‌టి కాదు రెండు కాదు...వందలు కాదు వేల‌ల్లో...కేసీఆర్ మాట చెల్లుబాటు కాక‌పోవ‌డం వ‌ల్ల నిరీక్ష‌ణ‌లో ఉన్నారు. ఇదంతా ప్ర‌భుత్వ ఉద్యోగుల గురించి - ఉద్యోగ బదలీలపై సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ సూచనలే అమలుకాని పరిస్థితి నెలకొంది. దీంతో వేలాదిమంది ప్రభుత్వోద్యోగుల నిరీక్షణకు మోక్షం దక్కడంలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,41,995 కాగా ప్రస్తుతం 3,33,781 మంది పనిచేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం ఖాళీల సంఖ్య 1.08,214గా ఉంది. ఇక ఉద్యోగ భర్తీకి 63,152 ప్రకటనలు ఇచ్చిన సర్కార్‌ 27,744 పోస్టులను భర్తీ చేసింది. నియామక దశల్లో 35వేలు - భర్తీ చేయాల్సినవి 45వేలుగా ఉంది. ఇప్పుడున్న కొరత నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారినుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఇంచార్జీ బాధ్యతలు నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో లక్షమందికి పైగా సెలెక్ట్‌ క్యాడర్‌(జూనియర్‌ అసిస్టెంట్‌ కు మించిన స్థాయి)లో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్న వాళ్లే. వీరిని బదలీ చేస్తేనే అసహనంతోపాటు - అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం కూడా గతంలో నిర్ణయించింది.

ఈ నేప‌థ్యంలో అంతర్‌రాష్ట్ర అధికారులు - ఉద్యోగుల బదలీలు - భార్యభర్తల బదలీలకు ఈ ఏడాది ఆగష్టు 7న సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. 2017 వేస‌వి సెలవులలోనే ఈ తతంగాన్ని ముగించి వచ్చే నూతన విద్యా ఏడాది ప్రారంభానికి ముందే టీచర్లు - ఇతర ప్రభుత్వ ఉద్యోగ బదలీలను పూర్తి చేయాలని సర్కార్‌ పెరిశీలించింది. కానీ వివిధ కారణాలతో అది ఫలించలేదు. మరోవైపు పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం పెండింగ్‌ లోనే పెట్టింది. కాగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగ పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడం కూడా ప్రభుత్వ ఉద్యోగుల బదలీలపై అనిశ్చితికి కారణమైంది. కమల్‌నాథన్‌ కమిటీ - షీలాబీడే కమిటీలు ఇంకా కసరత్తును సాగతీస్తుండటంతో పాలనపై ఇబ్బందులు పడుతున్నాయి.

సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడంపై ఇటీవలే ఆగ్రహం వ్యక్తమైంది. ఉద్యోగుల్లో పెరిగిపోయిన ఈ అస‌హ‌నం ఆనోటా ఈ నోటా సీఎం కేసీఆర్ దృష్టికి చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా ఆయన సీఎస్‌ను వివరాలు కోరినట్లుగా తెలిసింది. స్థూలంగా కేసీఆర్ మాటే చెల్లుబాటు కాక‌పోవ‌డం అనేది ఉద్యోగ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌ గా నిలిచింది.