Begin typing your search above and press return to search.

ఇంటికో ఉద్యోగం ప‌క్క రాష్ట్ర హామీ: కేసీఆర్

By:  Tupaki Desk   |   13 March 2016 11:32 AM GMT
ఇంటికో ఉద్యోగం ప‌క్క రాష్ట్ర హామీ: కేసీఆర్
X
కొన్ని అంశాల మీద వీలైనంత తొంద‌ర‌గా స్పందించాల్సి ఉంటుంది. ఆ ఏముందిలే అని నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే అదెంత పెద్ద ఇష్యూ అవుతుందో కేసీఆర్ లాంటి నేత‌కు చాలాబాగా తెలుసు. సుదీర్ఘ‌కాలం పాటు ఉద్య‌మాన్ని న‌డిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి.. విప‌క్షాలు ఎలాంటి అంశాల్ని అవ‌కాశంగా తీసుకొని రాజ‌కీయంగా ర‌చ్చ చేస్తార‌న్న‌ది బాగా తెలుసు. ఉద్య‌మ అనుభ‌వంతో ఆయ‌న ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటార‌న్న‌ది ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆయ‌న చేసిన ప్ర‌సంగం చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మొహ‌మాటాల‌కు పోకుండా మొగ్గ‌లోనే తాజాగా వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని ఆయ‌న నిర్దాక్షిణ్యంగా తుంచేయ‌టం క‌నిపిస్తుంది.

రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు కేసీఆర్ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌డుతూ.. కేసీఆర్ స‌ర్కారు ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని చెప్పింద‌ని.. కానీ అదేమీ చేయ‌టం లేద‌ని ఈ మ‌ధ్య‌న విమ‌ర్శ‌లు చేశారు. దీన్ని చాలా సీరియ‌స్ గా తీసుకున్న కేసీఆర్‌.. తాము అలాంటి హామీలు ఏమీ ఇవ్వ‌లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. తాము చెప్పిన‌ట్లుగా ఒక్క ఆధార‌మైనా చూపిస్తారా? అని నిల‌దీశారు. ఇంటికో ఉద్యోగం అన్న‌ది ప‌క్క రాష్ట్రానికి చెందిన అధినేత చేసిన హామీ అని.. దాంతో త‌మ‌కు సంబంధం లేద‌ని.. కేజీ టు పీజీ హామీ మిన‌హా మిగిలిన హామీల‌న్నీ పూర్తి చేసిన‌ట్లు ప్ర‌క‌టించామ‌న్నారు.

ఇంటికో ఉద్యోగం అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఉద్యోగాలు తీసుకురావ‌టమ‌ని.. అలాంటి ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికైనా సాధ్య‌మేనా? అని ప్ర‌శ్నించిన కేసీఆర్‌.. అలాంటి హామీతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అది సాధ్యం కాద‌ని కూడా విస్ప‌ష్టంగా తేల్చిచెప్ప‌టం గ‌మ‌నార్హం. త‌మ స‌ర్కారు వ‌స్తే ల‌క్ష ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పామ‌ని.. ఇప్ప‌టికే అందులో యాభైశాతం వ‌ర‌కూ ప్ర‌క్రియ మొద‌లైన‌ట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.

నిజానికి.. తెలంగాణ ఉద్య‌మం మొద‌ట్లో తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పాటు అయితే.. ప్ర‌తి ఇంటికి ఉద్యోగం ప‌క్కా అని టీఆర్ఎస్ నేత‌లు త‌ర‌చూ చెప్పేవారు. ఆ విషయాన్నే కాంగ్రెస్ నేత‌లు ప్ర‌స్తావిస్తూ.. ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌భుత్వం మీద ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తే.. ఇలాంటి ప్ర‌య‌త్నాల కార‌ణంగా ప్ర‌భుత్వంపై పడే మ‌చ్చను తుడ‌వ‌టం సాధ్యం కాద‌న్న విష‌యం తెలిసే.. ఎలాంటి మొహ‌మాటాల‌కు పోకుండా.. అలాంటి హామీ తామేమీ ఇవ్వ‌లేద‌ని కేసీఆర్ తాజాగా తేల్చేశారు. ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విష‌యాల్ని ప‌సిగ‌ట్ట‌టంలో కేసీఆర్ చురుకుద‌నాన్ని మెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నే చెప్పాలి.