Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ కు గెలుపు సంతోషం ఉండ‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   21 May 2019 5:08 AM GMT
గులాబీ బాస్ కు గెలుపు సంతోషం ఉండ‌ద‌ట‌!
X
ఎన్నిక‌లు వ‌స్తుంటే చాలు.. గులాబీ బాస్ కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే మాట‌ల్ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వింటుంటారు. ఆయ‌న అంచ‌నాల్ని చాలామంది న‌మ్మేయ‌టం క‌నిపిస్తుంటారు కూడా. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఆయ‌న చెప్పే మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌టం ఒక ఎత్తు అయితే.. ప్ర‌తిసారీ ఆయ‌న చెప్పిన స్థాయిలో విజ‌యాన్ని ఎలా అంచ‌నా వేస్తార‌న్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంటుంది.

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని 17ఎంపీ స్థానాల్లో ఒక స్థానం త‌న మిత్రుడి ఖాతాలో ప‌డుతుంద‌ని.. మిగిలిన 16 స్థానాలు త‌న‌వేన‌న్న ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు చూస్తే.. కేసీఆర్ అంచ‌నాలు త‌ప్పు అయ్యే అవ‌కాశం ఉంద‌న్నట్లుగా ఉన్నాయి. ప్ర‌తి ఎగ్జిట్ పోల్స్ లోనూ క‌నీసంగా బీజేపీకి ఒక సీటు.. కాంగ్రెస్ కు ఒక స్థానాన్ని ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.

అదే జ‌రిగితే.. కేసీఆర్ కు పెద్ద ఎత్తున సీట్లు గెలిచిన ఆనందం కంటే.. రెండు స్థానాల్లో ఓడిపోయిన బాధే ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మ‌ధ్య‌నే విడుద‌లైన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన మెజార్టీని ప‌లుచోట్ల పోగొట్టుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె బ‌రిలో ఉన్న నిజామాబాద్ లో మెజార్టీ భారీగా త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

అదే జ‌రిగితే.. కేసీఆర్ కు గెలిచిన ఆనందం కంటే.. ఈ వేద‌నే ఎక్కువ‌గా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి గులాబీ బాస్ పాల‌న మీద ఆగ్ర‌హంతో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ ఓట్ల‌ను ఇత‌ర పార్టీల‌కు వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ అంచ‌నా కానీ నిజ‌మైన ప‌క్షంలో గులాబీ బాస్ కు గెలుపు సంతోషం ఉండ‌ద‌నటంలో ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు.