Begin typing your search above and press return to search.

ఓటేయకుండానే గెలిపించిన సీమాంధ్రులు

By:  Tupaki Desk   |   6 Feb 2016 6:16 AM GMT
ఓటేయకుండానే గెలిపించిన సీమాంధ్రులు
X
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు అంత భారీ విజయం ఎలా సాధ్యమైంది? అద్భుతమైన గెలుపు అనంతరం.. చాలామందికి వచ్చిన డౌట్. ఇక..గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే సవాలచ్చ డౌట్లు వచ్చేశాయి. టీఆర్ ఎస్ గెలుపుపై సందేహం లేకున్నా.. మరీ ఇంత భారీ ఎత్తున గెలవటం ఏంటి? అది కూడా గ్రేటర్ చరిత్రలో ఎన్నడూ లేనంత అధిపత్యాన్ని ఒకే పార్టీకి హైదరాబాదీయులు కట్టబెట్టటం ఏమిటన్న ప్రశ్న పలువురిని వెంటాడి వేధించింది?

సాపేక్షంగా.. వాస్తవానికి దగ్గరగా ఈ అంశంపై దృష్టి సారిస్తే ఆసక్తికర వాస్తవాలు బయటపడతాయి. హైదరాబాద్ లోని హైదరాబాదీయులంతా తమను యాక్సెప్ట్ చేశారని.. తమకు అద్భుతమైన విజయాన్ని అందించారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం కొంచెమే. ఎలా అంటే.. నిజంగా హైదరాబాద్ లోని హైదరాబాదీయులంతా యాక్సెప్ట్ చేస్తే.. ఎంఐఎం పట్టున్న పాతబస్తీలో మజ్లిస్ మరింత బలపడటం ఏమిటి? 2009 ఎన్నికలతో పోలిస్తే.. మరోసీటును అదనంగా గెలుచుకోవటం ఏమిటి? గాలి ఉంటే మొత్తంగా ఉండాలే కానీ పాతబస్తీ మినహా అన్నట్లు ఉండకూడదు కదా?

ఒకవేళ కేసీఆర్ మాట నిజమే అయితే.. పాతబస్తీలో కూడా అక్కడి ప్రజలు టీఆర్ ఎస్ పార్టీకే పట్టం కట్టాలి కదా. పాతబస్తీ మినహా మిగిలిన గ్రేటర్ అంతా కేసీఆర్ బాట పడితే.. పాతబస్తీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఎందుకుందన్న విషయంలోనే.. గ్రేటర్ లో కేసీఆర్ కు అద్భుత విజయం ఎలా సాధ్యమైందన్న విషయం అర్థమవుతుంది.

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 45 కంటే తక్కువ. అందులో పాతబస్తీలో పోలింగ్ శాతాన్ని మినహాయిస్తే.. ‘గులాబీ సునామీ’ గుట్టు వీడిపోతుంది. పాతబస్తీలో జరిగిన పోలింగ్ శాతాన్న పక్కన పెట్టి.. మిగిలిన 105 డివిజన్ల పోలింగ్ శాతాన్ని సరాసరి చేసి చూస్తే.. ఓటింగ్ ఎంత తక్కువగా జరిగిందన్న విషయం అర్థమవుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల వారితో పాటు.. సీమాంధ్ర మూలాలు ఉన్న వారి సంఖ్య భారీగా ఉంటుంది. అలాంటి వారిలో ఎక్కువగా భాగం ఈసారి పోలింగ్ కు దూరంగా ఉండటమే టీఆర్ ఎస్ అద్భుత విజయానికి కారణంగా చెప్పొచ్చు.

ఇదే విషయాన్ని చిన్న లెక్కలో చూసుకుంటే.. పాతబస్తీ పరిధిలోని డివిజన్లలో నమోదైన పోలింగ్ ను మినహాయించి కేవలం 105 డివిజన్ల పోలింగ్ శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే.. అది 35 నుంచి38 శాతానికి కాస్త అటూఇటూగా ఉంటుంది. అంటే.. ఓట్లు వేసిన వారు కనుక వందకు 36 మంది అయితే.. వీరిలో పది శాతం కంటే తక్కువగా సీమాంధ్ర మూలాలు ఉన్నోళ్లు ఓట్లు వేశారు. వేసిన వారిలో వివిధ కారణాల వల్ల అధికారపార్టీకి కొద్దిమంది వేస్తే.. మిగిలిన వారంతా టీడీపీకి ఓట్లు వేసిన పరిస్థితి. ఓట్లు వేయని వారిలో తెలంగాణ అధికారపక్షానికి ఓట్లు వేయటానికి ఇష్టం లేక కొందరు.. కుదరక కొందరు.. వేసినా గెలిచే అవకాశం లేనప్పుడు ఓటు వేసి ఉపయోగం ఏముంటుందన్న భావనతో మరికొందరు పోలింగ్ కు దూరంగా ఉండటం కలిసి వచ్చింది.

ఇక.. ఓట్లు వేసిన సీమాంధ్ర మూలాలు ఉన్న వారు.. విభజన సమయంలో కాంగ్రెస్ తమకు చేసిన అన్యాయానికి ప్రతిగా ఓట్లు వేయలేదు. ఇక.. మిగిలిన వారు అధికారపార్టీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి. దీనికి డబుల్ బెడ్ రూం ఫ్లాట్ల హామీ కావొచ్చు.. తెలంగాణ అధికారపక్షానికి ధీటుగా హామీలిచ్చే పార్టీ లేకపోవటం.. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కనిపించే నాయకుడు లేకపోవటం లాంటి కారణాలతో.. వారంతా అధికారపక్షానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. దీంతో.. టీఆర్ ఎస్ కు ఇంత అద్భుత విజయం సాధ్యమైందని చెప్పొచ్చు. అంటే.. సీమాంధ్రులు ఓట్లు వేయకుండానే టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారని చెప్పొచ్చు.