Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ జాణతనం.. ప్రతిపక్షాల అమాయకత్వం!

By:  Tupaki Desk   |   24 May 2015 5:30 PM GMT
కేసీఆర్‌ జాణతనం.. ప్రతిపక్షాల అమాయకత్వం!
X
ఆరేడు నెలల తర్వాత జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. అది కూడా ప్రభుత్వ డబ్బుతో. ఈ ప్రచారానికి ఏకంగా దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. అంతేనా.. సాక్షాత్తూ గవర్నర్‌ నరసింహన్‌తోపాటు అధికార యంత్రాంగం మొత్తాన్ని తన ప్రచారంలో భాగస్వాములను చేశారు. 'స్వచ్ఛ హైదరాబాద్‌' అంటూ ఓ కార్యక్రమం చేపట్టి.. ఎన్నికల ప్రచారం కానిచ్చేశారు. ఇది కేసీఆర్‌ జాణతనం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన స్వచ్ఛ భారత్‌ను పట్టించుకోని కేసీఆర్‌.. ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్‌కు పిలుపు ఇచ్చారు. దానిపేరిట హైదరాబాద్‌లో బస్తీల బాట పట్టారు. అక్కడి నిరుపేదలపై వరాల వర్షం కురిపించారు. వారికి ఏకంగా రెండు లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. వాటి ధర ఒక్కోటి తొమ్మిది లక్షలు ఉండవచ్చని కూడా చెప్పారు. ఆరేడు నెలల్లోనే దీనిని పూర్తి చేస్తామని అన్నారు. బ్యాంకు రుణం చెల్లించాల్సిన పని కూడా లేదని, మొత్తం ఉచితమేనని వరాలు కురిపించారు. దీనితోపాటు ఎక్కడికక్కడ మరిన్ని వరాలను కూడా కురిపించారు. బస్తీవాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. తద్వారా, ఎన్నికలకు చాలా ముందే బస్తీవాసులను తనవైపు తిప్పుకొన్నారు. ఇప్పుడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడంటూ వారిని ఆకర్షించారు.

ఇక్కడ ప్రతిపక్షాలది విచిత్రమైన పరిస్థితి. కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారని గుర్తించలేని పరిస్థితి. గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన స్వచ్ఛ హైదరాబాద్‌ పేరిట బస్తీల్లో తిరుగుతున్నారు. ప్రతిపక్షాలు ఏమైనా అంటే స్వచ్ఛ హైదరాబాద్‌ను కూడా ప్రతిపక్షాలు చేయనివ్వడం లేదని అంటారు. దాంతోప్రతిపక్షాలు దీనిని ఎన్నికల ప్రచారం అనలేవు. అదే సమయంలో కేసీఆర్‌ను విమర్శించలేవు. ఇప్పుడు ఇక నెలకోసారి బస్తీ బాట పడతానని కేసీఆర్‌ చెప్పారు. అంటే, ఎన్నికలు జరిగే వరకూ కేసీఆర్‌ ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేస్తూనే ఉంటారు. ప్రతిపక్షాలు కళ్లప్పగించి చూస్తూ ఉండవలసిందే! దటీజ్‌ కేసీఆర్‌!!