Begin typing your search above and press return to search.

డామిట్.. ఒక్క మాట కేసీఆర్ ను ఎంత దెబ్బేసింది?

By:  Tupaki Desk   |   28 Sep 2016 11:30 AM GMT
డామిట్.. ఒక్క మాట కేసీఆర్ ను ఎంత దెబ్బేసింది?
X
నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా విలువైనది. అందులోకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే ప్రతి అంశాన్ని కొన్ని కోట్ల మంది నిశితంగా పరిశీలిస్తుంటారు. పరీక్షిస్తుంటారు. ప్రతిమాట లిట్మస్ టెస్ట్ కు గురి అవుతుంటుంది. కానీ.. అలాంటి విషయాల్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యంత్రులు పట్టించుకోవటం లేదా? అన్న సందేహం కలిగే పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి మాట్లాడతారు. తొందరపడి మాట జారటం పెద్దగా కనిపించదు.

కానీ.. అలాంటి కేసీఆర్ తాజాగా ఒక విషయం మీద చేసిన వ్యాఖ్య ఆయన్ను అడ్డంగా బుక్ చేసింది. విపరీతమైన నాలెడ్జ్.. ఏ విషయం మీదనైనా సరే.. అలవోకగా.. అరటిపండు ఒలిచినట్లుగా విప్పి చెప్పే వైఖరి కేసీఆర్ కు మాత్రమే సొంతం. ఎలాంటి మూడ్ లో ఉన్నారో.. లేక ఆయనకు పీడ్ బ్యాక్ ఇచ్చిన వారి తప్పో కానీ..హైదరాబాద్ మహానగరం రోడ్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజకీయ పక్షాలే కాదు.. ప్రజలు కూడా కేసీఆర్ మాటను అండర్ లైన్ చేసుకొని మరీ చర్చించుకునే పరిస్థితి.

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ.. హైదరాబాద్ రోడ్ల మీద తిరిగే ప్రతి ఒక్కరికి కేసీఆర్ మాటల్లో తప్పు గుమ్మడికాయంతగా కనిపించింది. దీనికి తోడు.. కొద్ది రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర రోడ్ల పై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. దీనికితోడు.. ఎప్పుడూ లేనంత దారుణాతి దారుణంగా నగర రోడ్లు తయారయ్యాయి. ఈ మధ్యన కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేసినట్లుగా.. నగరంలో గుంత లేని రోడ్లు చూపిస్తే.. తాను డబ్బులిస్తానని సవాల్ విసిరారు.

ఇలాంటి పరిస్థితులున్న వేళ.. హైదరాబాద్ మొత్తంలో దెబ్బ తిన్న రోడ్లు 10 శాతం మాత్రమేనని చెప్పటంలో అర్థం లేదని చెప్పక తప్పదు. చాలా అరుదుగా మాత్రమే ఇలా దొరికిపోయే కేసీఆర్ ను విపక్షాలు వదిలిపెట్టటం లేదు. దొరికిన సువర్ణావకాశాన్ని చేతబట్టి మరీ.. కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఇదంతా చూసిన గులాబీ దళ నేతలు.. ఒక్క మాటనే ఇంతలా పట్టించుకోవటం ఏమిటంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ ‘రోడ్డు’ మాట ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/