Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ కు చెడ్డ పేరు తేవొద్ద‌ని కేసీఆర్ విజ్ఞ‌ప్తి

By:  Tupaki Desk   |   24 Sep 2016 2:25 PM GMT
హైద‌రాబాద్‌ కు చెడ్డ పేరు తేవొద్ద‌ని కేసీఆర్ విజ్ఞ‌ప్తి
X
భారీ వ‌ర్షాల‌తో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అయిపోయింది. జ‌నాలు ఇళ్ల‌లోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కూడా భ‌య‌ప‌డిపోతున్నారు. ప‌రిస్థితిని కంట్రోల్‌ లోకి తెచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్ని అప‌సోపాలు ప‌డుతున్నా చాలా ఏరియాల్లో నీరు ఇంకా ఇళ్ల‌లోనే ఉంటోంది. హైద‌రాబాద్ ప‌రిస్థితి చాలా భ‌యంక‌రంగా ఉంద‌ని అటు మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో కూడా తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కేసీఆర్ హైద‌రాబాద్‌ కు ఏకంగా స‌ముద్ర‌మే తెచ్చార‌ని కొంద‌రు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు.

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల‌పై మీడియాలో హోరెత్తుతున్న ప్ర‌చారం టీఆర్ ఎస్ స‌ర్కార్‌ కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిపోయింది. హైద‌రాబాద్ ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ? అని ప్ర‌పంచ‌దేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఈ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లకు సీఎం కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ హైద‌రాబాద్‌ లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి మ‌రీ అంత భ‌యంక‌రంగా లేద‌ని... మీడియాలో దీన్ని ఓవ‌ర్‌ గా చూపించి హైద‌రాబాద్ న‌గ‌రానికి చెడ్డ పేరు తీసుకు రావ‌ద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

హైద‌రాబాద్‌ లో కురిసిన ఈ భారీ వ‌ర్షాల‌కు ఒక్క మ‌నిషి కాదు క‌దా ఒక్క జంతువు కూడా చ‌నిపోలేద‌ని ఆయ‌న అన్నారు. న‌గ‌రంలో అక్ర‌మ క‌ట్ట‌డాల వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్న కేసీఆర్ మూసి న‌ది నాలాల‌పై 28 వేల అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను గుర్తించామ‌ని..వీట‌న్నింటిని నిర్దాక్షిణ్యంగా కూల‌గొడ‌తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ క‌ట్ట‌డాల్లో ప్ర‌భుత్వ భ‌వనాలు ఉన్నాయ‌ని వాటిని కూడా కూల్చుతామ‌న్నారు. ఇక న‌గ‌రంలో వ‌ర‌ద‌ల దృష్ట్యా 400 పాత భ‌వంతుల‌ను ముందుగానే కూల్చ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింద‌న్నారు.

ఇక హైద‌రాబాద్‌ లో ప్ర‌స్తుతం కురిసిన వ‌ర్షం ఈ శ‌తాబ్దంలోనే అత్య‌ధిక‌మ‌ని కూడా ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్‌ లో సెప్టెంబ‌ర్‌ లో సగ‌టు సాధార‌ణ వ‌ర్షపాతం 84 మిల్లీమీట‌ర్లు ఉండాల్సి ఉండ‌గా ఈ యేడాది అది 468 మిల్లీమీటర్లు అయ్యింద‌న్నారు. ఇక న‌గ‌రంలోని వ‌ర‌ద ప‌రిస్థితి గురించి కేంద్రానికి వివ‌రించి కేంద్రం సాయాన్ని కోర‌తామ‌ని చెప్పారు.

కేసీఆర్ విజ్ఞ‌ప్తి - మేయ‌ర్ వార్నింగ్ :

ఇక హైద‌రాబాద్ వ‌ర్షాల‌ను భ‌యంక‌రంగా చూపించ‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ మీడియాకు విజ్ఞ‌ప్తి చేస్తే...న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మాత్రం వార్నింగ్ ఇచ్చారు. హైద‌రాబాద్ వ‌ర‌ద ప‌రిస్థితిపై సోష‌ల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టేవారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. హుస్సేన్‌ సాగర్‌ కు ప్రమాదం ఉందని, కాప్రా చెరువు తెగుతుందని సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు.