Begin typing your search above and press return to search.

‘పనికిమాలిన’ మాటపై కేసీఆర్ ను నిలదీస్తే..

By:  Tupaki Desk   |   31 Dec 2016 5:08 AM GMT
‘పనికిమాలిన’ మాటపై కేసీఆర్ ను నిలదీస్తే..
X
ఒక్కొక్కరి మాట తీరు ఒక్కోలా ఉంటుంది. అలా అని ఎక్కడపడితే అక్కడ.. ఎవరిని పడితే వారిని తన మాట తీరుతో మాట్లాడతానని చెప్పటం సబబు అవుతుందా? అంటే.. కాదనే చెబుతారు. కానీ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి తీరు మాత్రం అందుకు భిన్నం గా ఉంది. కేసీఆర్ కు కోపం వచ్చినా.. తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సి వస్తే.. ఆయన మాటలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన అనే మాటలపై చాలా సందర్భాల్లో రచ్చ జరిగిన సంగతిని మర్చిపోలేం. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని తాడూ బొంగరం లేనిదిగా వ్యాఖ్యానించటం.. పనికిమాలిన చట్టం.. లాంటి వ్యాఖ్యల్ని చేయటంపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది.

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భూసేకరణ చట్టంపై కేసీఆర్ మండిపడుతూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వేళ.. ఆయన మాటల్ని అడ్డుకుంటూ.. విపక్ష నేత జానారెడ్డి అభ్యంతరం చెప్పిన వేళ.. జానారెడ్డికి కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పటం.. అందుకు అంగీకరించి ఆయన ఊరుకుంటే.. సీఎం కేసీఆర్ మాట్లాడటం అయిపోయిన వెంటనే సభను వాయిదా వేయటంపై పలువురు తప్పు పట్టారు.

ఇదే విషయాన్ని తాజాగా జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్ని ఎప్పటివరకూ నిర్వహించాలన్న అంశంపై అఖిలపక్ష సభ్యులు చర్చించిన వేళ.. కేసీఆర్ అండ్ కో పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ మార్క్ మాటలైనా..దిక్కుమాలిన.. తాడు బొంగరం లేని లాంటి పదాలపై సమావేశంలో చర్చకు తీసుకొచ్చిన భట్టికి బదులిస్తూ.. తన భాష అంతేనని.. తప్పేం లేదని చెప్పటం గమనార్హం. తనను తాను సమర్థించుకునే విషయంలో కేసీఆర్ తీరును చూసిన వారు ముక్కున వేలేసుకోవాల్సిందే. మాటలతో ఎదుటివారి మనోభావాల్ని దెబ్బ తీసేలా పరుష మాటల్ని.. తన భాష అంతేనని చెప్పుకోవటాన్ని ఎవరు మాత్రం ఏమి అనగలరు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/