Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట:పార్టీ మారటం రాజకీయం కాదు

By:  Tupaki Desk   |   4 Jun 2016 4:47 AM GMT
కేసీఆర్ మాట:పార్టీ మారటం రాజకీయం కాదు
X
తామున్న పార్టీ నుంచి నేతలు మరోపార్టీకి మారటం ఏమవుతుంది? రాజకీయం అవుతుంది. చిన్నపిల్లాడు సైతం చెప్పే ఈ మాట తప్పని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తన మాటల మాయాజాలంతో సరికొత్త వాదనను వినిపించే ఆయన.. తాజాగా చెప్పిన ముచ్చట ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారే ముచ్చటను ‘రాజకీయ పునరేకీకరణ’ అన్న ముద్దుమాటను చెబుతున్నారు కేసీఆర్.

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ సాగాలని.. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ పోరు సాగినట్లే.. వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ ఎస్ లోకి రావటాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా కీర్తించటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.

తెలంగాణ రాజకీయ ఆలోచన సరళి ఇటీవల కాలంలో మారిందని.. ప్రజలు టీఆర్ ఎస్ మీద మొగ్గు చూపుతున్నారన్న కేసీఆర్.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మధిర జెడ్పీటీసీ సభ్యురాలు.. ఎంపీపీలతో సహా పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ అంటే ఏమిటో దేశానికి అర్థం కావాలని.. ఇందుకోసమే రాజకీయ పునర్వ్యవస్థికరణ జరగాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో నిజం ఉంది. ఒక రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలతా ఒక్కొక్కరుగా అధికారపార్టీ తీర్థం పుచ్చుకుంటూ.. విపక్షాలు మొత్తం ఖాళీ అయితే.. ఈ వైనం దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారదా? అందరి దృష్టిని ఆకర్షించదా? ఇప్పటికే కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల్ని నామమాత్రం చేసిన టీఆర్ఎస్ అధినేత జోరు చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తప్పవన్నట్లే.