Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పొడిగింపు పై సారు మార్కు.. మరోసారి అలాంటి నిర్ణయం

By:  Tupaki Desk   |   4 May 2020 6:15 AM GMT
లాక్ డౌన్ పొడిగింపు పై సారు మార్కు.. మరోసారి అలాంటి నిర్ణయం
X
నలుగురు నడిచే బాటలో నడిచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి సందేహాలు ఉండవు. కాకుంటే.. తన మార్క్ ప్రస్ఫుటంగా కనిపించాలని ఆయన ఆరాటపడుతుంటారు. మిగిలిన వారికి భిన్నంగా కొత్తదనంతో పాటు.. ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా ఆయన తీసుకునే నిర్ణయాలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి.

కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్న వైనాన్ని అందరి కంటే ముందుగా హెచ్చరించటమే కాదు.. దేశంలోనే తొలిసారి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయటం తెలిసిందే. మే మూడు వరకూ లాక్ డౌన్ 2.0ను కేంద్రం ప్రకటిస్తే.. దాన్ని ఏడు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. తాజాగా లాక్ డౌన్ 3.0కు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కారు. ఇప్పటికే మే మూడు నుంచి రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా.. కేసీఆర్ తన మార్కును చూపించేలా ఈ పొడిగింపును మే 21 వరకూ తెలంగాణ లో అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

లాక్ డౌన్ వేళ కేంద్రం జారీ చేసిన సడలింపులపై కసరత్తు చేయటంతో పాటు.. వేటిని అమలు చేయాలన్న అంశంపైనా ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. వలస కూలీలు.. కార్మికుల్ని వారి సొంతూళ్లకు పంపే విషయంలో కేంద్రం తొలుత ప్రకటించిన దానికి భిన్నంగా యూటర్న్ తీసుకోవటంపైనా చర్చిస్తున్న ఆయన.. వారి సమస్యకు పరిష్కార మార్గం గురించి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

గ్రీన్ జోన్ లలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలన్న అంశంపైనా చర్చిస్తున్నారు. ఏపీలో మద్యం దుకాణాల్ని ఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి ఏమిటన్న దానిపైనా చర్చిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఏయే రంగాలకు లాక్ డౌన్ సడలింపు ఇవ్వాలన్న అంశంతో పాటు.. వాటిని ఎలా అమలు చేయాలన్న విషయంలోనూ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడున్న లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగింపు ఉంటుందని.. గ్రీన్ జోన్ లో కార్యకలాపాల్ని పెంచాలని భావిస్తున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందన్న విషయం పైనా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రజల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకోవటం.. కరోనా ముప్పు పెరగకుండా కట్టడి చేసేలా ప్రభుత్వ విధానం ఉండాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా అయినా.. ప్రజల్ని సంతోష పెట్టేలా చర్యలు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ విధానంగా చెబుతున్నారు.