Begin typing your search above and press return to search.

మజ్లిస్ ఫ్రెండ్ అని కేసీఆర్ తప్పు చేశారా?

By:  Tupaki Desk   |   30 Jan 2016 7:21 AM GMT
మజ్లిస్ ఫ్రెండ్ అని కేసీఆర్ తప్పు చేశారా?
X
కొందరితో స్నేహాలు అంత మేలు చేయవు. కొందరితో బంధురికాలు కలిసి రావు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. ఎన్నికల్లాంటి కీలక సమయాల్లో కలయికలు.. పొత్తులు ఎంతగా లాభిస్తాయో.. అంతే ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. తాజా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట నుంచి కొత్త మిత్రుడి మాట వచ్చింది.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు కొన్ని రహస్య రాజకీయ మిత్రులు కొత్తేం కాదు. కాకుంటే.. మజ్లిస్ తో స్నేహం కొత్త విషయమేమీ కాదని.. చాలా పాతదని.. నిండు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సర్కారుకు తాము మిత్రపక్షంగా ఉంటామని.. అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారని.. అప్పటితో తమ మధ్య బంధం బలపడిందని.. ఆ పార్టీ తమకు మిత్రపక్షంగా ఉంటుందని చెబుతూ పలువురిని విస్మయానికి గురి చేశారు.

మజ్లిస్ మిత్రుడన్న మాట మిగిలిన సమాయాల్లో ఎలా ఉన్నా.. కీలక గ్రేటర్ ఎన్నికల సమయంలో మతతత్వ పార్టీని మిత్రుడిగా ఒప్పుకోవటమే కాదు.. అవసరమైతే వారితో చెట్టాపట్టాలు వేసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు.

గ్రేటర్ పరిధిలోని 150 స్థానాల్లో 40 స్థానాలు మినహా మిగిలిన స్థానాలన్నీ మజ్లిస్ కు ఎదురుగాలి గీచే స్థానాలే. అదే సమయంలో ఎంత మిత్రుడని చెప్పినా.. మజ్లిస్ బరిలో ఉన్న చోట కారు దూసుకెళ్లే అవకాశం తక్కువే. అయినప్పటికీ.. తమ బలం ఎంత ఉందో తెలుసుకోవాలన్న ఆలోచనలో మిత్రుడు పోటీ చేసే చోటా బరిలోకి దిగటం తెలిసిందే.

ఓపక్క మిత్రుడితో తలపడుతూ మరోపక్క.. వారితో కలిసి చెట్టాపట్టాలు వేసుకునేందుకు తాము సిద్ధమని తేల్చి చెప్పటం.. మజ్లిస్ ను వ్యతిరేకించే వారిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయినప్పటికీ.. తమ బలం మీద విపరీతమైన విశ్వాసం ఉన్న కేసీఆర్.. మజ్లిస్ వ్యతిరేకత తమకు ఎలాంటి ముప్పు కాదన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇది తెలంగాణ అధికారపక్ష ప్రయోజనాల్ని దెబ్బ తీసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్సాహంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఆ పార్టీకి శాపంగా మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అలాంటిదేమీ ఉండదని గులాబీ నేతలు బల్ల గుద్ది వాదిస్తున్నారు. మజ్లిస్ మిత్రుడంటూ కేసీఆర్ చేసిన వాదనను గ్రేటర్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నరన్న విషయం తుది ఫలితాలు తేలుస్తాయని చెప్పకతప్పదు.