Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త కల ఖర్చు ఎంతవుతుందో..?

By:  Tupaki Desk   |   7 May 2016 5:26 AM GMT
కేసీఆర్ కొత్త కల ఖర్చు ఎంతవుతుందో..?
X
కొత్త విషయాల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆసక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. పాత విషయాల మీద చర్చ జరిపే కన్నా.. నిత్యంఏదో ఒక కొత్త అంశం మీద ఆయన ఫోకస్ చేయటం తెలిసిందే. నిత్యం ఏదో ఒక కొత్త ఆవిష్కారం కోసం.. ఒక కొత్త కలను తెర మీద తెచ్చేందుకు ఆయన అమితాసక్తి ప్రదర్శిస్తుంటారు. మొన్నటి వరకూ రాజధానిలో ఏర్పాటు చేసే భారీ నిర్మాణాల మీద దృష్టి పెట్టిన కేసీఆర్.. ఈ మధ్యన పే..ద్ద విగ్రహాలు.. స్థూపాల మీద ఫోకస్ చేయటం తెలిసిందే. గడిచిన మూడు రోజులుగా ఆయన మరో కొత్త అంశంపై దృష్టి సారించారు. తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచాలన్న పాత నిర్ణయం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది.

ఇప్పటికే ఉన్న 10 జిల్లాల స్థానంలో అదనంగా మరో 15 జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉండటం తెలిసిందే. ఈ జిల్లాలకు సంబంధించి కేసీఆర్ మదిలోని ఆలోచనల్ని తాజాగా ఆయన అధికారుల ముందు పెట్టటం తెలిసిందే. ఇప్పుడున్న కలెక్టరేట్లు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా లేవని.. భవిష్యత్ అవసరాలను తీర్చేలా కొత్తగా నిర్మించే కలెక్టరేట్లు ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసిన కేసీఆర్.. కొత్త కలెక్టరేట్లు ఎలా ఉండాలన్న తన ఆలోచనను అధికారులతో పంచుకునే ప్రయత్నం చేశారు.

కోర్టులు.. పోలీస్.. జిల్లాపరిషత్.. ట్రాన్స్ కో.. ఆర్టీసీ.. లాంటి అతికొద్ది శాఖలు మినహాయించి మిగిలిన శాఖల కార్యాలయాలన్నీ జిల్లా కలెక్టరేట్ లో నిర్మించే భారీ భవనంలోనే ఉండాలి. అంతేకాదు.. ప్రజలు.. అధికారులు పెద్ద ఎత్తున కూర్చొని సమావేశాలు పెట్టుకునేలా భవనాలు ఉండటమే కాదు.. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన.

పచ్చటి తోటల్ని తలపించేలా పూల మొక్కలతో.. సువిశాల ప్రాంగణంతో తక్కువలో తక్కువ 25 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణ సముదాయాల్ని నిర్మించాలన్న అభిలాషను కేసీఆర్ వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లోనే హెలిప్యాడ్ లాంటి ఏర్పాట్లతో పాటు.. సాంకేతికంగా అత్యాధునికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్న మాటను చెప్పుకొచ్చారు. ఇంత భారీ కల దాదాపు 15 కొత్త జిల్లాల్లో ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకు భారీగా ఖర్చు కావటం ఖాయంగా కనిపిస్తోంది. కలల్ని ఆవిష్కరించటంలో తనదైన మార్క్ ను ప్రదర్శించే కేసీఆర్.. మరోసారి ఆ విషయంలో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించారని చెప్పక తప్పదు.