Begin typing your search above and press return to search.

జిల్లాల మీద కేసీఆర్ ఏం చెప్పిండు భయ్..

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:44 AM GMT
జిల్లాల మీద కేసీఆర్ ఏం చెప్పిండు భయ్..
X
కొత్త జిల్లాల్ని దసరా నుంచి షురూ చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ ప్రయత్నంలో చాలా సీరియస్ గా పని చేస్తున్న విషయం మరోసారి స్పష్టమైంది. తాజాగా ఆయన.. టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. జిల్లా అధ్యక్షులతో వర్క్ షాపు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. ఆసక్తికర అంశం ఏమిటంటే.. కేసీఆర్ నోటి నుంచి ఒకే అంశం రెండు వేర్వేరు సందర్భాల్లో రావటం చూస్తే.. కొత్త జిల్లాల ఎంపికలో చాలానే అంశాలు ముడిపడి ఉన్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

‘‘కొత్త జిల్లాల ఏర్పాట్లపై వచ్చే విమర్శల్ని పట్టించుకోవద్దు. రాజకీయ కారణాలతో వచ్చే డిమాండ్లు అర్థం లేనివి. ప్రజల డిమాండ్లు.. ప్రజల సౌకర్యాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించిన కేసీఆర్.. మరో సందర్భంలో.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటును ఆషామాషీగా తీసుకోవద్దు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. వారికి ఏది అవసరమో అదే చేద్దాం. జిల్లాల ఏర్పాటు మీ రాజకీయ జీవితానికి ఆధారం. మీ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టకండి. అందరితో మాట్లాడండి. భేషజాలకు పోవద్దు. ప్రాంతాలు.. సెంటిమెంట్లు.. ప్రజల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా సూచనలు చేయండి’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఓపక్క కొత్త జిల్లాల మీద వచ్చే రాజకీయ డిమాండ్లను పట్టించుకోవద్దంటూనే.. మరోవైపు మీ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుకోవద్దంటూ చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు..కొత్త జిల్లాల ఏర్పాటులో ‘‘రాజకీయ’’ కోణం కీలకంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదేమో.