Begin typing your search above and press return to search.

నష్టాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Oct 2015 10:30 PM GMT
నష్టాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కేసీఆర్
X
అసెంబ్లీ నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. ఒక పార్టీలోని కొంతమంది సభ్యులను సస్పెండ్ చేస్తే కాస్త ప్రభావం ఉంటుంది. ఒక పార్టీ మొత్తాన్ని సస్పెండ్ చేస్తే ఇంకాస్త ప్రభావం ఉంటుంది. ప్రతిపక్షాలు అన్నిటినీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసేసి, అసెంబ్లీని చాపచుట్టేస్తే దాని ప్రభావం ప్రభుత్వం మీద చాలా ఉంటుంది. అదే సమయంలో ఆయా ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుకుని పార్టీకొక జిల్లాను పంచుకుని ప్రజల్లోకి వెళ్లిపోతే..? అప్పుడు ప్రభుత్వానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఇదే.

అధికారంలోకి వచ్చిన పార్టీ మన ప్రజాస్వామ్యంలో తానే సర్వంతర్వామి అన్నట్లు వ్యవహరిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రసమితి అయితే తాను తప్ప తెలంగాణలో మరేదీ లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసలు ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది కూడా. ఇదే తీరును అసెంబ్లీలోనూ కొనసాగిస్తోంది. రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా చేసినట్లు.. మొత్తం ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని భావిస్తోంది. రేవంత్ రెడ్డిని మాట్లాడకుండా చేసినప్పుడు మిగిలిన ప్రతిపక్ష నాయకులు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ, అందరికీ ముప్పు ఏర్పడినప్పుడు అంతా కలిసికట్టుగా స్పందించకుండా ఎలా ఉంటారు?

అసెంబ్లీలో అన్ని పార్టీలనూ సస్పెండ్ చేసేయడంతో అన్ని పార్టీలూ కలిసి ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంపై చెడ్డపేరు వచ్చింది. ప్రజల్లో అది మరికాస్త పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్పందించి తాను ప్రాణం ఉండగా తప్పు చేయనని, ప్రతిపక్షాలను తాము గెంటేయలేదని, అవే గెంటించుకుని పోయాయని చెబుతున్నారు. అయితే, ఉద్యమ సమయంలో ఆయన ఇవే మాటలు చెప్పినప్పుడు ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా విశ్వసించాయి. కానీ, ఇప్పుడు విశ్వసించే పరిస్థితి పోయింది. కేసీఆర్ క్రమంగా నమ్మకం కోల్పోతున్నారు. ఇది టీఆర్ ఎస్ కే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.