Begin typing your search above and press return to search.

ఉన్నవాటికి దిక్కు లేదు కానీ కొత్తవా కేసీఆర్?

By:  Tupaki Desk   |   20 Feb 2016 1:26 PM GMT
ఉన్నవాటికి దిక్కు లేదు కానీ కొత్తవా కేసీఆర్?
X
సరిగ్గా ఒక రోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సందర్భంగా ఆసుపత్రుల్లోని దారుణ పరిస్థితులకు కదిలిపోయిన ఆయన.. ఆసుపత్రి నుంచే వైద్యఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి గాంధీ దుస్థితి గురించి మాట్లాడటమే కాదు.. చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్దవైన ఉస్మానియా.. గాంధీ తదితర ఆసుపత్రుల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉంటే.. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా వైద్య ఆరోగ్య శాఖా బడ్జెట్ పై రివ్యూ చేపట్టారు. ఉన్న వాటిని ముందు ఎలా బాగు చేయాలన్న విషయాన్ని వదిలేసిన కేసీఆర్.. నగరం నాలుగు వైపులా నాలుగు పెద్ద ఆసుపత్రుల ఏర్పాటు మీద తన స్వప్నాన్ని చెప్పుకొచ్చారు. ఎన్ని నిధులైనా విడుదల చేస్తామని.. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగ్గా పని చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.

ఓపక్క ఉన్న ఆసుపత్రుల్లో వసతులు ఏమాత్రం బాగోలేవని.. రోగులు దారుణ ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని గవర్నర్ చేపట్టిన ఆకస్మిక తనిఖీ నిరూపించిన తర్వాత కూడా కొత్త ఆసుపత్రుల నిర్మాణం.. అందుకు తగిన స్థలాల ఎంపిక గురించి చర్చలు జరపటం ఏమిటో సీఎం కేసీఆర్ కే తెలియాలి. ఈ రెండు పరిణామాలు చూస్తే.. ఉన్న వాటికే దిక్కులేదు కానీ కొత్తవా అనిపించక మానదు.