Begin typing your search above and press return to search.

నేనే సీనియ‌ర్‌ ను...మ‌రో సంచ‌ల‌నానికి కేసీఆర్ రెడీ

By:  Tupaki Desk   |   12 Dec 2018 12:49 PM GMT
నేనే సీనియ‌ర్‌ ను...మ‌రో సంచ‌ల‌నానికి కేసీఆర్ రెడీ
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత, అప‌ద్ధ‌ర్మ‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రో కీల‌క ప‌రిణామానికి తెర తీశారు. టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం అనంత‌రం ఆయ‌న తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కొత్తగా కొలువుదీరే శాసనసభలో తానే సీనియర్ ఎమ్మెల్యేనని కేసీఆర్ చెప్పారు. తన తర్వాత రెడ్యా నాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సీనియర్లు అని తెలిపారు. లెక్క ప్రకారం 95 నుంచి 106 సీట్లు తాము గెలవాల్సి ఉంది. ఖమ్మంలో తమ పార్టీ అంతర్గత విబేధాల వల్లే ఓడిపోయామని పేర్కొన్నారు. గెలిచిన వాళ్లే కాదు.. గెలవని వాళ్లు కూడా తనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. గెలవని వాళ్లను కూడా కలవాలి.. వాళ్లతో మాట్లాడాలి అని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారని కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా మ‌రో ఎన్నిక‌కు తెర‌తీసిన‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వెల్ల‌డించారు. వారం రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికలపై నోటిఫై చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చామన్నారు కేసీఆర్. 100 రోజుల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలివ్వడంతో.. ప్రభుత్వం ఏర్పడి ఉండాలి కాబట్టి.. తనతో పాటు మరొకరు రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఐదారు రోజుల్లో మిగతా వారు ప్రమాణస్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇదే సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌పై కూడా గులాబీ ద‌ళ‌ప‌తి స్పందించారు. దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం అవసరం ఉందని అన్నారు. ``బీజేపీ, కాంగ్రెస్ సైకాలజీ బాగాలేదు. ఈ రెండు పార్టీలు దొందూ దొందే. జాతీయ పార్టీలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ఓట్ల కోసం జాతీయ నాయకులు అబద్ధాలు చెబుతున్నారు. సీపీఎస్‌పై కాంగ్రెస్‌ది ద్వంద్వ విధానం. కేంద్రం తాను చేయాల్సిన పని చేయకుండా రాష్ర్టాలపై పెత్తనం చేలాయిస్తుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా రాష్ర్టానికో విధానం ఉంది` అని అన్నారు. ``రాష్ట్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య శాఖలు కేంద్రానికి ఎందుకు? ఐఐటీ, పరిశోధన కేంద్రాలు ఇతర రాష్ర్టాలతో పంచుకునే సమస్య లేదు.

దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం అవసరం. మూస వ్యవసాయ విధానం పనికిరాదు. రాజకీయ అవకాశవాదంతో నడుస్తున్న పేలవమైన పార్టీలు ఇవి. దేశంలో వందకు వంద శాతం మేనిఫెస్టో అమలు చేసిన పార్టీ టీఆర్‌ఎస్. మేనిఫెస్టోలో లేని పలు పథకాలు కూడా అమలు చేశాం. రాష్ట్ర సంపద పెరిగినందున అదనపు పథకాలు అమలు చేశాం. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఇందు కోసం ఫెడరల్ ఫ్రంట్ వేదికగా ప్రత్యేక చొరవ తీసుకుంటాను. దేశం మొత్తం రైతుబంధు అమలు చేస్తే రూ. మూడున్నర లక్షల కోట్లు ఖర్చు అవుతోంది`` అని కేసీఆర్ తెలిపారు.