Begin typing your search above and press return to search.

పట్టిసీమకు తెలంగాణ అనుమతా!?

By:  Tupaki Desk   |   17 March 2015 2:30 PM GMT
పట్టిసీమకు తెలంగాణ అనుమతా!?
X
అడ్డదిడ్డమైన వాదన చేయడంలోనూ, ఎదురు దాడి చేయడంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను మించినవాళ్లు మరెవరూ ఉండరని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు మరో ఉదాహరణ, పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక అనుమతులు తీసుకోవాలని కేసీఆర్‌ వ్యాఖ్యానించడమేనని అంటున్నారు.

''మనం మహబూబ్‌నగర్లో పాలమూరు ఎత్తిపోతల నిర్మించాలని భావించాం. దానితో పది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని భావించాం. కానీ, చంద్రబాబు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పాలమూరు ఎత్తిపోతలకు గండికొట్టి సీమాంధ్రలో పట్టిసీమ ఎత్తిపోతల కడుతున్నాడు. పాలమూరు నీటిని ఎత్తిపోతలకు తీసుకుపోతున్నాడు. పట్టిసీమ కట్టాలంటే తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అనుమతి కూడా తీసుకోవాలి'' అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

అయితే,

దీనికి సంబంధించిన వాస్తవాలు మాత్రం ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నం. ఉదాహరణకు ఒక జారుడు బల్లను తీసుకుందాం. జారుడు బల్ల నుంచి నీటిని కిందికి వదులుతున్నారని అనుకుందాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జారుడు బల్ల పైభాగంలో నిర్మిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతలను జారుడు బల్ల కింది భాగంలో నిర్మిస్తున్నారు. రెండు ప్రాజెక్టు వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో జారుడు బల్ల కింది భాగంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పైభాగంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు నీటిని ఎలా తీసుకుంటుంది!? వాస్తవానికి, జారుడు బల్ల పైభాగంలో నిర్మించిన ప్రాజెక్టు నీటిని వినియోగించుకోగా మిగిలిన నీరే కిందికి వస్తుంది. ఆ నీటినే కింద ఉన్న ప్రాజెక్టు వినియోగించుకోగలుగుతుంది. కానీ, కేసీఆర్‌ వాదన మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం.

ఇంకా చెప్పాలంటే, పట్టిసీమ దాటిన తర్వాత గోదావరి నీళ్లు చేరుకునేది సముద్రంలోకే. అంటే అంత చిట్టచివర్లో పట్టిసీమ ఎత్తిపోతలను కడుతుంటే ఎగువ రాష్ట్రం అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తోందో అర్థం కాదు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, నీటిపారుదల నిబంధనల ప్రకారం ఎగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకోవాలంటే దిగువ రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలి. కానీ, చిట్ట చివరి రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకోలంటే ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే, మిగులు నీటితోనే అది ప్రాజెక్టులు కట్టుకుంటుంది కనక. అయినా, కేసీఆర్‌ అడ్డగోలు వాదన చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.