Begin typing your search above and press return to search.

పేరు పోయి.. పంచాయితీ మిగిలిందే..?

By:  Tupaki Desk   |   8 Oct 2015 6:25 AM GMT
పేరు పోయి.. పంచాయితీ మిగిలిందే..?
X
తెలంగాణ అధికారపక్షం నేతల వేదన ఓ రేంజ్ లో ఉంది. వ్యూహంలో దొర్లిన పొరపాటు కారణంగా.. పేరు ప్రతిష్టలు సొంతం కావాల్సిన స్థానే. అప్రదిష్ట మిగిలిందన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముందు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి చాలానే అంచనాలు వెలువడ్డాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజంటేషన్ తెలంగాణ అధికారపక్షం వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాదు.. విపక్షాలు డిఫెన్స్ లో పడేలా కేసీఆర్ వాదన ఉంటుందన్న మాట వినిపించింది.

ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ పై చాలానే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఉభయ సభల్ని సమావేశ పరిచి.. ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం అధికారికంగా సాధ్యం కాదని.. సభను వాయిదా వేసిన తర్వాత మాత్రమే చేయొచ్చన్న విషయాన్ని అధికారులు చెప్పటంతో.. తెలంగాణ అధికార పక్షానికి తగిలిన మొదటి ఎదురుదెబ్బగా చెబితే.. రైతుల ఆత్మహత్యల విషయంలో.. విపక్షాలన్నీ ఏకమై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి.

ఇలాంటి సమయంలో.. ఒకట్రెండు రోజులు.. లేదంటే మరో రోజు విపక్షాల ఆందోళనలతో సభను వాయిదా వేయటం చేస్తుంటారు. అందుకు భిన్నంగా మజ్లిస్ మినహా మిగిలిన పార్టీ నేతల్ని సస్పెన్షన్ చేయటంతో అధికార.. విపక్షాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంశం ఎక్కడికో వెళ్లిపోయింది. విపక్షాల విషయంలో కాసింత ఓపికగా వ్యవహరించి.. తెలివిగా.. ప్రాజెక్టు రీడిజైనింగ్ మీద తన వాదనను చెప్పి ఉంటే.. సర్కారుకు ఎంతోకొంత మైలేజీ మిగిలేదన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. తాజా అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలపై అధికారపక్షం పేచేయి సాధించే అవకాశం ఉన్నా.. తొందరపాటు చర్యతో మంచి అవకాశం మిస్ అయ్యామన్న భావన తెలంగాణ అధికారపక్షం నేతలు కొందరి నోటి నుంచి వినిపించటం గమనార్హం.