Begin typing your search above and press return to search.

ఆ రెండింటికి కేసీఆర్ ఛాయిస్ ఎవరు?

By:  Tupaki Desk   |   13 May 2016 5:03 AM GMT
ఆ రెండింటికి కేసీఆర్ ఛాయిస్ ఎవరు?
X
మరో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే.. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీ అధినేతలు తమకు తాముగా నిర్ణయించి పదవులు కట్టబెట్టే ఎన్నికలుగా చెప్పాలి. రాజ్యసభలోని 57స్థానాలు ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో పదవుల కోసం ఆశలు పెట్టుకున్న నేతలు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేసే పరిస్థితి. మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో తెలంగాణకు రెండు స్థానాలు దక్కనున్నాయి. ఈ రెండు స్థానాలకు తెలంగాణ అధికారపక్షానికే దక్కునుంది. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న బలమే దీనికి కారణం.

ఇక.. ఈ రెండు స్థానాల్లో ఇప్పటివరకూ తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన వీహెచ్ హనుమంతరావు.. టీడీపీ నేతగా రాజ్యసభకు వెళ్లి.. అనంతరం టీఆర్ ఎస్ లో చేరిన గుండు సుధారాణి ఉన్నారు. మరి.. ఈ రెండు సీట్లకు సంబంధించి కేసీఆర్ ఎవరికి కట్టబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీహెచ్ కు మరోసారి అవకాశం లేని విషయాన్ని వదిలేస్తే.. గుండు సుధారాణికి మాత్రం కేసీఆర్ మరో దఫా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే.. ఈ విషయం మీద స్పష్టత లేదనే చెప్పాలి.


అదే సమయంలో రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేసీఆర్ ఛాయిస్ లో పలువురు నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టేందుకు వీలుగా.. రెండు రాజ్యసభ స్థానాల్ని ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారికి కట్టబెట్టి ప్రమోషన్ పేరిట ఢిల్లీకి పంపాలన్నది ఒక ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు.. కొత్తగా వచ్చిన వారికి రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉన్నా.. మొదటి ప్లాన్ కే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇక.. రాజ్యసభకు సంబంధించి రెండు స్థానాలకు కోసం టీఆర్ ఎస్ లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ పదవుల కోసం పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన డి శ్రీనివాస్ పేరు వినిపించినా.. ఆయనకు ఆ అవకాశం దక్కేది తక్కువన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం మంత్రులుగా వ్యవహరిస్తున్న నాయిని నర్సింహారెడ్డి.. కడియం శ్రీహరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని ఢిల్లీకి పంపి.. ఆ స్థానాల్లో కొత్తగా వచ్చిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రాజ్యసభ స్థానాల కోసం బలంగా పోటీ పడుతున్న వారిలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. డి. దామోదర్ రావు.. ఢిల్లీలో టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న రామచంద్రుడి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో నెలకొన్న అంచనాలకు తగ్గట్లే కేసీఆర్ నిర్ణయం ఉంటుందా? లేక తనదైన శైలిలో నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.