Begin typing your search above and press return to search.

కేసీఆర్ రాజ్య‌స‌భ‌కు పంపేది ఎవ‌రిని?

By:  Tupaki Desk   |   4 Jan 2018 5:57 AM GMT
కేసీఆర్ రాజ్య‌స‌భ‌కు పంపేది ఎవ‌రిని?
X
మ‌రికొద్ది రోజుల్లో జ‌రిగే రాజ్య‌స‌భ స్థానాల భ‌ర్తీ విష‌యం తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఖాళీ అయ్యే మూడు స్థానాలు తెలంగాణ అధికార‌ప‌క్షానికే రానున్నాయి. ఎమ్మెల్యేల బ‌లం ఆధారంగా సాగే ఎన్నిక‌ల్లో క్లియ‌ర్ క‌ట్ మెజార్టీ ఉన్న టీఆర్ ఎస్‌ కు మూడు స్థానాలు ల‌భించ‌నున్నాయి. అయితే.. త్వ‌ర‌లో భ‌ర్తీ చేసే రాజ్య‌స‌భ స్థానాల్లో యాద‌వుల‌కు ఒక స్థానాన్ని కేటాయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ స్థానం యాద‌వుల‌కు కేటాయించ‌టం ఖాయం.

మ‌రి.. ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్క‌నుంద‌న్న విష‌యానికి వ‌స్తే.. ఇద్ద‌రి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు పార్టీకి చెందిన రాష్ట్ర గొర్రెలు.. మాంసం అభివృద్ది కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ క‌న్నెబోయిన రాజయ్య కాగా.. మ‌రొక‌రు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ తుల ఉమ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఊహించిన‌ విధంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో దిట్ట అయిన కేసీఆర్‌... ఈ ఇద్ద‌రు కాకుండా కొత్త ముఖాన్ని తెర మీద‌కు తెచ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.

ఇక‌.. మిగిలిన రెండు ఖాళీల భ‌ర్తీకి మూడు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ మూడు పేర్లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. కొంత ఆశ్చ‌ర్యానికి గురి చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి.. తెలంగాణ రాష్ట్ర స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి పేర్లు రాజ్య‌స‌భ రేసులో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. మూడో పేరు.. కేసీఆర్‌ కు ద‌గ్గ‌ర బంధువు.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే సంతోష్ పేరు వినిపిస్తోంది.

మ‌రి. ఈ ముగ్గురిలో ఎవ‌రికి ఎంత ఛాన్స్ అన్న విష‌యాన్ని చూస్తే.. మొద‌ట‌గా నాయిని. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే స‌మ‌యంలో ఆయ‌న‌కు కీల‌క‌మైన హోం మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ఆయ‌న్ను ఎమ్మెల్సీ ద్వారా ఎంపిక చేశారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం 2020 నాటికి పూర్తి కానుంది.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌రిగే రాజ్య‌స‌భ‌కు ఆయ‌న్ను పంపితే.. ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిని రాజ్య‌స‌భ‌కు పంపుతార‌న్న మాట జోరుగా వినిపిస్తోంది. ఒక‌వేళ‌.. ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపితే.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల ప‌ల్లికి ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించాల్సి ఉంటుందా? అన్న ప్ర‌శ్న తెర‌పైకి వ‌స్తోంది. అయితే.. రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసే నాటికి ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే టైం ఉన్న నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం చాలా త‌క్కువ‌.

ఇక‌.. ఈ ఇద్ద‌రిని రాజ్య‌స‌భ‌కు పంపే విష‌యంలో సానుకూల‌త‌ల‌తో పాటు ప్ర‌తికూల‌తలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు. నాయినిని రాజ్య‌స‌భ‌కు పంపట‌మంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని రంగంలోకి దించే విష‌యంలో కేసీఆర్ ఒక నిర్ణ‌యానికి ఇప్ప‌టికే వ‌చ్చి ఉంటే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ అదృష్టం వ‌రించిన‌ట్లేన‌ని చెబుతున్నారు. త‌న‌కు వీర విధేయుడిగా ఉండ‌ట‌మే కాదు.. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో నాయిని త‌న తీరుతో కేసీఆర్‌కు ఇబ్బంది పెట్టింది లేదు. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఇద్ద‌రు ఎంపీలు (కెకే.. డీఎస్‌) బీసీలు కావ‌టం.. ఇద్ద‌రు మున్నూరుకాపు వ‌ర్గానికే చెందిన వారే కావ‌టంతో.. మ‌ళ్లీ అదే వ‌ర్గానికి చెందిన మ‌ధుసూద‌నాచారిని పంపుతారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. కేసీఆర్‌కు ద‌గ్గ‌ర బంధువు.. పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మేకాదు.. కేసీఆర్‌కు అనుక్ష‌ణం నీడ‌లా ఉండే సంతోష్ ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌న్న వాద‌న జోరుగా వినిపిస్తోంది. అయితే.. ఇవ‌న్నీ అంచ‌నాలు మాత్ర‌మే. వీటికి భిన్నంగా కేసీఆర్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఏమైనా నోటిఫికేషన్‌కు ముందు నుంచే.. రాజ్య‌స‌భ రేసులోకి కొన్ని పేర్లు వ‌చ్చేయ‌టంతో.. వీరికి పోటీగా మ‌రికొన్ని పేర్లు తెర మీద‌కు రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.