Begin typing your search above and press return to search.

మందుబాబులపై ఒక చూపు చూసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   19 May 2022 2:35 AM GMT
మందుబాబులపై ఒక చూపు చూసిన కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ‘మందు బాబులు’ గుర్తుకు వచ్చారు. తాజాగా మద్యం ధరల్ని పెంచుతూ తెలంగాణ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాకింగ్ గా మారనుంది. పెంచిన మద్యం ధరల్ని ఈ రోజు (గురువారం) నుంచే అమలు చేయనున్నారు.

మద్యం ధరల్ని పెంచాలంటూ రేట్ కాంట్రాక్ట్ నెగోషియేషన్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయటం.. ఆ వెంటనే సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో మద్యం ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మద్యం దుకాణాల్లోనూ ఈ పెంచిన ధరల్ని తక్షణం అమలు చేస్తారు. దీంతో మందుబాబుల జేబులకు అదనపు భారం పడనుంది.

అయితే.. ఏ మేరకు పెరిగాయి? అన్నవిషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీనికి కారణం.. పెంచిన ధరల్ని వెల్లడిస్తే.. మద్యం దుకాణాలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున.. ఆ ఛాన్సు ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. బుధవారం మద్యం దుకాణాల వారు ఇచ్చిన ఆర్డర్ ను కూడా నిలిపేశారు. పెంచిన ధరల్ని వెల్లడించటానికి ముందు.. మద్యం దుకాణాల్లో ఉన్న స్టాక్ ను చెక్ చేస్తారని చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 28 బ్రాండ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగే వీలుందని చెబుతున్నారు. దీంతో మద్యం క్వార్టర్ పై రూ.20.. పుల్ బాటిల్ పై రూ.80 - 100 వరకు.. ఒక్కో బీర్ బాటిల్ పై రూ.10 - 20 మేర పెరిగే వీలుందని చెబుతున్నారు. మద్యం ధరల్ని పెంచిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులందరిని బుధవారం రాత్రి ఆఫీసుల్లో ఉంచేసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపుల్లోని స్టాక్ వివరాల లెక్క తేల్చినట్లుగా తెలుస్తోంది.

పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. రుణం కోసం ప్రయత్నాలు చేయటం.. దానికి కేంద్రం కొర్రీ పెట్టటం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అదనపు రుణం రావటం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వానికి అత్యవసర ఇంధనమైన ఆదాయాన్ని జనరేట్ చేసేందుకు వీలుగా.. ఉన్న ఏ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే మద్యం ధరల్ని పెంచితే.. తక్షణం ఆదాయం ఖజానాకు అందుతుందని భావిస్తున్నారు.

అయితే.. విమర్శలకు అవకాశం లేకుండా.. మందుబాబుల నోటి నుంచి ఓకే అనిపించేలా మద్యం ధరల్ని పెంచితే.. మరికొద్ది రోజుల్లో ఇంకోసారి భారం వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి ధరల్ని పెంచిన పక్షంలో.. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని.. అందుకే జాగ్రత్తలు తీసుకొని మరీ మద్యం దరల్ని పెంచనున్నట్లు చెబుతున్నారు. పెంచిన ధరల వివరాలు బయటకు వస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆదాయం ఎంతన్న లెక్క మీద స్పష్టత వస్తుందని చెప్పక తప్పదు.