Begin typing your search above and press return to search.

టీ క్యాబినెట్ భేటీలో క్లాసులే ఎక్కువట

By:  Tupaki Desk   |   4 Jun 2016 6:20 AM GMT
టీ క్యాబినెట్ భేటీలో క్లాసులే ఎక్కువట
X
ప్రత్యర్థి చేష్టలుడిగినట్లుగా ఉన్న సమయంలో పట్టు బిగిస్తే త్వరగా ఫిక్స్ చేసే వీలు ఉంటుంది. ఇలాంటి విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా అనుభవం ఉంది. ఎప్పుడు ఎవరికి ఎక్కడ నొక్కాలో ఆయనకు తెలిసినంత బాగా తెలుగురాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో మరెవరికీ తెలీదేమో? దీనికి నిదర్శనమే తాజాగా సాగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీలో కేసీఆర్ తన కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించారు. ఎలా అమలు చేయాలన్న విషయాన్ని సహచర మంత్రులకు దిశానిర్దేశం చేసి పనులు పురమాయించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మూడున్నర గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీలో.. నింగిని అంటిన సంబరాల గురించి తన సహచరులతో కేసీఆర్ అస్సలు మాట్లాడలేదట. క్యాబినెట్ సమావేశం షురూ అయినప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ సర్కారు తీరును ప్రశ్నించటం.. ఏమేం చేయాలన్న అంశాల మీద తన వాదనను వినిపించటంతో పాటు.. తెలంగాణ ప్రాజెక్టుల మీద చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రులు ఎవరూ స్పందించకపోవటం.. తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేయని మంత్రివర్గ సహచరులపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారట.

తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టుల మీద ఏపీ సర్కారు అబద్ధాలను ప్రచారం చేస్తుందంటూ గుస్సా అయిన కేసీఆర్.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశాలతోపాటు.. మహారాష్ట్రతో చేసుకునే ఒప్పందాలను ఆమోదించినట్లుగా చెబుతున్నారు. పలు విషయాల మీద చర్చ సందర్భంగా మంత్రులకు క్లాసులే ఎక్కువగా పడినట్లుగా చెబుతున్నారు. మూడున్నర గంటల క్యాబినెట్ మీటింగ్ లో దాదాపు గంటన్నర పాటు సాగునీటి ప్రాజెక్టుల అంశాల మీదనే ఎక్కువ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. మంత్రివర్గ సమావేశం కాస్తంత హాట్ గానే సాగినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి క్లాస్ పీకిన నేపథ్యంలో తమపై విమర్శలు గుప్పించే వారిపై తెలంగాణ మంత్రులు ఎలా విరుచుకుపడతారో చూడాలి మరి.