Begin typing your search above and press return to search.

తెలంగాణ ఉద్యోగులకు సగం క్యాష్ పేమెంట్?

By:  Tupaki Desk   |   25 Nov 2016 6:00 AM GMT
తెలంగాణ ఉద్యోగులకు సగం క్యాష్ పేమెంట్?
X
తెలంగాణలో వేతన జీవుల కష్టాలను కొంత వరకైనా తీర్చాలని కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకోసం డిసెంబరు 1న వేతనాలు ఇవ్వడంలో కొంత మాత్రమే ఖాతాలకు వేసి మిగతాది ఆయా కార్యాలయాల్లోనే నగదుగా ఇచ్చే ఆలోచనలో ఉంది.

ప్రభుత్వ - ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు డిసెంబర్‌ తొలి వారంలో వేతనాలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 3.50 లక్షల వరకు ఉన్నారు. పింఛనుదారులు మరో 2.40 లక్షల మంది ఉన్నారు. వీరందరికి వేతనాలు చెల్లించడానికి రూ. 4,500 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తాలను ఉద్యోగులు - పింఛనుదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దుతో ఉద్యోగులు నగదు పొందే వెసులుబాటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సరిపడా నగదు నిల్వలు తమ వద్ద లేవని బ్యాంకర్లు ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపారు. గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులు ఈ విషయం పై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉద్యోగులు తమ వేతనాలను నగదుగా పొందని పక్షంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించారు. ఉద్యోగులకు రూ. 10 వేల వరకు నగదు చెల్లించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అంత మొత్తం నగదుగా చెల్లించలేమని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంకర్లు కూడా పూర్తి వేతనాలను ఒకే సారి చెల్లించడం సాధ్యం కాదని తెలిపారు.

పది వేల వరకు నగదు చెల్లించడంతో పాటుగా బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతనాల్లో సగం వరకు నగదుగా మార్చుకొనే వెసులుబాటు కల్పించే అంశం పై కూడా చర్చించారు. ఈ విధమైన ఏర్పాట్ల వల్ల సామాన్య ప్రజల నుండి బ్యాంకర్ల పై వ్యతిరేకత వస్తుందని, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని భావిస్తున్నారు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్యాంకర్లను ఒప్పించి కొంత నగదును ఇప్పించడం, ఉద్యోగులు కోరిన విధంగా వేతనంలో రూ. 10 వేల వరకు కార్యాలయంలోనే నగదు చెల్లించడం అనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ట్రెజరీలు కూడా గత కొంత కాలంగా నగదు చెల్లింపులను తగ్గించి బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరుపుతున్నాయి. ఒకే సారి వేల కోట్లు ఉద్యోగులకు పంపిణీ చేయడం పెను సమస్యగానే పరిణమించబోతుందని ట్రెజరీ అధికారులు తెలిపారు.

మరోవైపు ఉద్యోగులకు కొంత మొత్తం నగదుగా అంచేసిన పక్షంలో ఆ సదుపాయం తమకు కూడా వర్తింపచేయాలని పింఛను దారులు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వెసులుబాటును ప్రైవేటు సంస్ధల ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని బ్యాంకర్ల పై ఒత్తిడి తేవడానికి అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఖాతాలతో సమానంగా ప్రైవేటు సంస్ధలు ఖాతాలు బ్యాంకుల్లో ఉన్నందున బ్యాంకర్లకు ఇదో పెద్ద సమస్యే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/