Begin typing your search above and press return to search.

కేసీఆర్ గంద‌ర‌గోళంలో ప‌డ్డారా?

By:  Tupaki Desk   |   15 Sep 2016 9:12 AM GMT
కేసీఆర్ గంద‌ర‌గోళంలో ప‌డ్డారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇర‌కాటంలో ప‌డ్డార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఉద్య‌మ‌నాయ‌కుడిగా స్వ‌యంగా తాను చేసిన ప్ర‌క‌ట‌న‌కు - ఇపుడు సీఎం హోదాలో వ‌హిస్తున్న మౌనం విష‌యంలో ఆయన్ను ప్ర‌తిప‌క్షాలు ఇరుకున ప‌డేశాయ‌ని అంటున్నారు. నిజాం నవాబును తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి - తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలన్న డిమాండ్ అధికార టీఆర్ ఎస్‌ కు ఇరకాటంగా పరిణమించిందనేది మొత్తం టాక్ వెనుక సారాంశం.

తెలంగాణతో పాటు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన ఆ రెండు రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ స్వాతంత్య్రదినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తూనే ఉన్నాయి. జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఎగురవేస్తున్నారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా విమోచన/విలీన దినంగా ప్రకటించని వైనంపై విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై తెదేపా - కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శించారు. తెలంగాణ పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం మీకు చరిత్రగా కనిపించడం లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న మేమే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెరాస అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా - ఇప్పటివరకూ సెప్టెంబర్ 17పై ఎలాంటి అధికార కార్యక్రమాలు నిర్వహించకుండా దాటవేస్తూ వస్తున్నారు.తన కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న తెరాస - దానిని సచివాలయంలో ఎందుకు ఎగురవేయడం లేదని నిలదీస్తున్నారు. ఒకవైపు నిజాం - రజాకార్లపై పోరాడిన చాకలి ఐలమ్మను పొగుడుతూ - నిజాంను కీర్తించే కేసీఆర్ వైఖరి విచిత్రంగానే కాకుండా గంద‌ర‌గోళంగా ఉందని చ‌ర్చ సాగుతోంది. నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్‌ పై త‌మ దాడిని జోరుగా కొన‌సాగిస్తున్నాయి.

తాజాగా సెప్టెంబర్ 17 సమీపిస్తుండటంతో విలీన/విమోచన దినంపై మళ్లీ డిమాండ్లు ఊపందుకుని - కేసీఆర్ సర్కారుపై అవి ఒత్తిడి పెంచుతున్నాయి. రెండురోజుల క్రితం కేంద్రమంత్రి దత్తాత్రేయ దీనిపై ఒక రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించగా - పాల్గొన్న వారిలో మెజారిటీ శాతం విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వంతో పనిలేకుండా కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకుని విమోచన దినంగా ప్రకటించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ మేరకు కేంద్రానికి వందల సంఖ్యలో వినతిపత్రాలు పంపారు. ఈ విషయంలో విపక్షాలు కూడా బీజేపీ దారి పడుతున్నట్లు కనిపిస్తోంది. 17న విమోచన దినంగా ప్రకటించాలని, దానివల్ల మైనారిటీల్లో వ్యతిరేకత ఏమీ రాదని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ ఎస్ ప‌రిస్థితి ఇరకాటంగానే ఉంది. విపక్షాల డిమాండ్ మేరకు అధికారికంగా విమోచన లేదా విలీనదినంగా ప్రకటించినా, అది ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్న రాజకీయ కోణంలో మౌనం వహిస్తోంది. తెరాస సర్కారుకు మజ్లిస్ మద్దతునిస్తుండటంతోపాటు, తెలంగాణలో మైనారిటీలు తెరాసకు మద్దతుదారులుగా ఉండటమే దానికి కారణం. సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రకటిస్తే అది మత సమస్యగా పరిణమించే ప్రమాదం ఉన్నట్లు తెరాస ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.