Begin typing your search above and press return to search.

సచివాలయం మీద కేసీఆర్ మైండ్ సెట్ మారిందట

By:  Tupaki Desk   |   8 May 2016 4:44 AM GMT
సచివాలయం మీద కేసీఆర్ మైండ్ సెట్ మారిందట
X
కలల్ని ఆవిష్కరించటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తరచూ కొత్త కొత్త కలల్ని ఆవిష్కరించటం ఒక ఎత్తు అయితే.. ఆ ఊహా ప్రపంచంలో ప్రజలు ఉండిపోయేలా చేసే టాలెంట్ ఆయన సొంతం. తన ప్రతి కలను ఆవిష్కరించే కేసీఆర్ లో గొప్ప మేజిక్ ఏమిటంటే.. ఆ కలను కోట్లాది తెలంగాణ ప్రజలకు కనెక్ట్ చేయటమే కాదు.. కన్వీన్స్ అయ్యేలా మాటలు చెప్పటం ఆయనకే చెల్లుతుంది. మరి.. తాను ఆవిష్కరించిన స్వప్నాల్లో ఎన్నింటిని అమలు చేశారన్న లెక్కలోకి ఎవరూ వెళ్లనీయకుండా చేయటం కూడా కేసీఆర్ గొప్పతనంగానే చెప్పాలి.

స్వప్నాన్ని ఆవిష్కరించటం ఎంత తేలిగ్గా చేయగలుగుతారో.. వాటిల్లో మార్పులు చేర్పులు కూడా అంతే సింఫుల్ గా చేసేస్తుంటారు. తెలంగాణ సచివాలయాన్ని మార్చాలన్న తన నిర్ణయాన్ని బయటకు వెల్లడించి పెద్ద వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు. రాజకీయ పార్టీలు.. కొన్ని వర్గాలు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. తెలంగాణ ప్రజానీకంలో మాత్రం ఈ విషయం మీద పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎందుకిలా అని చూస్తే.. కేసీఆర్ మాటలే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండటం.. కీలక అధికారుల క్వార్టర్స్ తో పాటు.. తెలంగాణ సచివాలయం సరికొత్తగా ఉండాలంటూ ఆయన ఊరింపు మాటలు తెలంగాణ ప్రజల మీద పని చేసినట్లుగా చెప్పాలి.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ సచివాలయాన్ని మార్చాలన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఆ ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సచివాలయ మార్పు విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనప్పటికీ.. సచివాలయ మార్పు మీద కేసీఆర్ వెనకడుగు వేశారట. ఇప్పుడున్న సచివాలయానికి మార్పులు చేయటం.. అదనపు అంతస్తులు ఏర్పాటు చేయటం లాంటివి చేయాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం (సమత బ్లాక్) 11 అంతస్తులకు పెంచటం.. మిగిలిన భవనాల్ని సైతం 10 అంతస్తులకు పెంచాలని నిర్ణయించారట. వాస్తు ఇబ్బందులు ఉంటే.. వాటిని సరి చేస్తే సరిపోయే దానికి అనవసర ఖర్చు వద్దన్న సూచనను మొదట్లో పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి తోడు ఏపీ సచివాలయం మొత్తం జూన్ చివరి నాటికి ఖాళీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఏపీకి కేటాయించిన భవనాలన్నీ తెలంగాణకు వచ్చేయనున్నాయి. దీంతో.. కార్యాలయాల కొరత కూడా ఉండదని.. ఇప్పుడున్న భవనాలకు మరమ్మతులు చేయటం ద్వారా ఖర్చు తగ్గించొచ్చన్న ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు. ఖర్చు మీద కేసీఆర్ కు అంత ముందు జాగ్రత్తే ఉండి ఉంటే.. సరికొత్త సచివాలయ కలను కనేవారే కాదు కదా? తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయాలనే మొండితనం ఉన్న ముఖ్యమంత్రి.. తన కల నుంచి వెనక్కి తగ్గటమేమిటి చెప్మా..?