Begin typing your search above and press return to search.

కేసీఆర్ భోజన ప్రియత్వం మరోసారి బయటపడింది

By:  Tupaki Desk   |   3 Aug 2021 11:48 AM GMT
కేసీఆర్ భోజన ప్రియత్వం మరోసారి బయటపడింది
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పని విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. గంటల తరబడి కూర్చొని సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ఆయన ఒక్కరే అవుతారేమో? రివ్యూకు పిలిచిన వారికి గంటల్ని నిమిషాలుగా మార్చి పంపటం.. బయటకు వచ్చిన వారంతా ఇంతసేపు రివ్యూ జరిగిందా? అన్న భావనకు తీసుకురావటం కేసీఆర్ టాలెంట్ కు నిదర్శనంగా చెప్పాలి. పని విషయంలో ఎంతలా పని చేస్తారో.. తీసుకునే ఫుడ్ విషయంలోనూ ఆయన అంతేలా వ్యవహరిస్తారని చెబుతారు.

తన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టి కానీ పంపించని ఆయన.. కొందరి ఇళ్లకు భోజనాలకు వెళ్లిన సందర్భంగా కేసీఆర్ భోజన ప్రియత్వాన్ని చూసి గొప్పగా చెప్పుకుంటారని చెబుతారు. సాధారణంగా యాభై దాటితే తినే తిండి విషయంలో సవాలచ్చ లెక్కలు చూసుకొని తినటం మామూలే. కానీ.. కేసీఆర్ తీరు అందుకు భిన్నమని చెబుతారు. మధ్యాహ్నం వేళ చేసే లంచ్ లో ఆయన హ్యాపీగా తినేస్తారని చెబుతారు. ఆయన దంత పుష్టి ఎక్కువనే మాట ఆయన సన్నిహితుల నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇష్టంగా తినటం.. రుచిగా ఉంటే అడిగి మరీ వడ్డించుకోవటం కేసీఆర్ లో కనిపిస్తాయి. సాధారణంగా ఎవరింటికైనా వెళ్లి భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా వంటకం రుచి బాగుంటే.. మరికాస్త వడ్డించమని అడగటానికి కాస్త మొహమాటపడతారు. కానీ.. కేసీఆర్ మాత్రం అలాంటి మొహమాటానికి గురి కారని.. బాగుందని మెచ్చుకోవటం ద్వారా.. మరికాస్త వడించేలా చేస్తారని చెబుతారు. సాగర్ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఇంట్లో భోజనం చేశారు.

ఆయనతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు.. స్మితా సబర్వాల్.. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా భోజనానికి కూర్చున్నారు. ఎమ్మెల్యే భగత్ స్వయంగా వడ్డిస్తుంటే.. తమతో కలిసి కూర్చొని తినాలని కేసీఆర్ కోరగా.. ఆయన వారితో పాటు కలిసి భోజనానికి కూర్చున్నారట. భగవత్ సతీమణి భవానీ సీఎం కేసీఆర్ కు పలు వంటల్ని వడ్డించారు.

భోజనంలో మటన్.. తలకాయ కూర.. బొటీ..నాటుకోడి కర్రీ.. చికెన్ ఫ్రై.. చేపల కర్రీ.. రోస్టు.. పప్పు.. సాంబార్.. పెరుగు.. ఒక స్వీటు వడ్డించారని.. అన్నింటిని రుచి చూసిన ఆయన.. వంటకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన పొగడ్తకు ఎమ్మెల్యే భగత్ సతీమణి సంతోషానికి గురయ్యారు. తన భోజన ప్రియత్వాన్ని తాజా పర్యటనలో కేసీఆర్ మరోసారి చూపించారని చెప్పాలి.