Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆర్డ‌ర్‌..క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   13 July 2017 3:30 AM GMT
కేసీఆర్ ఆర్డ‌ర్‌..క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎమ్మెల్యే
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు త‌న పార్టీపై, ప్ర‌భుత్వంపై ఉన్న ప‌ట్టుకు మ‌రో నిద‌ర్శ‌నం ఇది. వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హరించిన ఎమ్మెల్యే త‌న పార్టీకి చెందిన నేత అయిన‌ప్ప‌టికీ చూసి చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌కుండా క‌లెక్ట‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేసీఆర్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. లేదంటే స‌స్పెండ్ చేస్తాన‌ని సైతం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ నిప్పులు చెరిగిన తీరుతో ఎమ్మెల్యే గంట‌ల వ్య‌వ‌ధిలోనే క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కలెక్టర్ ప్రీతిమీనా తన సోదరితో సమానమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. కలెక్టర్ ప్రీతిమీనాకు అనుకోకుండా తన చేయి తగిలి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ మూడో విడ‌త సంద‌ర్భంగా హరితహారం సందర్భంగా మ‌హ‌బూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారు. ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ఎమ్మెల్యే తీరు పట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణ చెప్పాలని సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ ను ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యేను సీఎం హెచ్చరించారు. ఇవాళ జరిగిన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసిన సీఎం..కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడి ప్రభుత్వం, పార్టీ తరపున సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్‌లను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం దాల్చిన నేప‌థ్యంలో ప‌లువురు పార్టీ నేత‌లు సైతం ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో ఫోన్లో మాట్లాడి మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణలు చెప్పాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. దీంతో గంట‌ల వ్య‌వ‌ధిలోనే శంక‌ర్ నాయ‌క్ క్ష‌మాప‌ణ‌లు తెలిపి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.