Begin typing your search above and press return to search.

ఈ ఎన్నిక‌ను కేసీఆర్ రెఫరెండంగా తీసుకుంటారా?

By:  Tupaki Desk   |   6 Sep 2017 11:41 AM GMT
ఈ ఎన్నిక‌ను కేసీఆర్ రెఫరెండంగా తీసుకుంటారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ఉప ఎన్నికకు సిద్ధ‌ప‌డుతున్నారా? త‌న పార్టీకి బాగా అచ్చివ‌చ్చిన ఉప ఎన్నిక‌ల మంత్రాన్ని అధికారంలో ఉన్న స‌మ‌యంలో కూడా ఉప‌యోగించుకోద‌ల్చారా? త‌న బ‌లాబ‌లాల‌కు స‌ర్వేల కంటే ఉప ఎన్నికే స‌రైన‌ద‌ని భావిస్తున్నారా? అదే స‌మ‌యంలో త‌న ప‌రిపాల‌న‌ను రెఫ‌రెండంగా కూడా ఈ ఎన్నిక‌ను చూడ‌నున్నారా?...ఇవ‌న్నీ తెలంగాణ రాజ‌కీయవ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌లు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిపై అంచ‌నాలు.

అధికార టీఆర్‌ ఎస్ పార్టీకి చెందిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదంటూ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన బీజీపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని - ఆయన భారత పౌరుడు కాదని 2013 సంవత్సరంలో తీర్పు వెలువరిచింది. దీనిపై చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇదిలా ఉండగా, ఆయన 2014 ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ను తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన వెకేషన్ పిటిషన్‌ పై 2016 ఆగస్టు 11న వాదనలు జరిగాయి. దానిపై ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన సుప్రీం కోర్టు ఆరు వారాల్లోగా రమేశ్ పౌరసత్వంపై విచారణ చేసి, నివేదిక సమర్పించాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు హోంశాఖ మంగళవారం నాడు ఆయన భారత పౌరుడు కాదని తేల్చింది.

ఈ ఆదేశాల‌పై అప్పీల్ చేస్తామని చెన్నమనేని ర‌మేశ్ మీడియాకు చెప్పిన‌ప్ప‌టికీ వివ‌రాల ప్ర‌కారం కోర్టు తీర్పు అనుకూలంగా రాద‌నే అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక త‌ప్ప‌ద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి. దీనికి గులాబీ ద‌ళ‌ప‌తి సైతం సై అంటార‌ని విశ్లేషిస్తున్నారు. త‌న సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో వంద‌కు పైగా సీట్లు టీఆర్ ఎస్‌ కు రావ‌డం ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వేలు తేలుస్తున్న‌ట్లుగా ప‌దే ప‌దే కేసీఆర్ చెప్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలా అంచ‌నాల ఆధారంగా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింప‌డం కంటే ఫ‌లితాల ఆధారంగానే టీఆర్ ఎస్ బ‌లం ఏంటో చూపే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగే ఈ ఉప ఎన్నిక‌ - అందులోనూ టీఆర్ ఎస్ పార్టీకి బాగా ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క అవుతుంద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి చూపించ‌డం ద్వారా త‌న పాల‌న‌కు రెఫ‌రెండంగా కేసీఆర్ చెప్పుకొనే చాన్స్ ఉంద‌ని అంటున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన అనంత‌రం ఈ మేర‌కు నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలుస్తోంది.