Begin typing your search above and press return to search.

బీజేపీకి కేసీఆర్‌ దగ్గరయినట్లేనా!?

By:  Tupaki Desk   |   9 April 2015 4:10 AM GMT
బీజేపీకి కేసీఆర్‌ దగ్గరయినట్లేనా!?
X
వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గర అయినట్లేనా!? జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు కాస్త సానుకూల పవనాలు వీస్తున్నట్లేనా!? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను వేధిస్తున్నాయి.

వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌పై మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఇదే వైఖరి రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆరు నెలల్లో వచ్చినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పొత్తుకు అవకాశం ఉండదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, కేసీఆర్‌ కూడా ఇదే కోరుకుంటున్నారని అంటున్నారు.

వికారుద్దీన్‌ పేరు చెప్పగానే నరేంద్ర మోదీకి బద్ధ వ్యతిరేకి గుర్తుకొస్తాడు. గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగానే అతడు ఉగ్రవాదంలోకి అడుగుపెట్టాడు. మోదీని చంపడమే తన ధ్యేయమని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇటువంటి పరిస్థితుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్లోనే హతమయ్యాడు. ఇప్పుడు ఇది కేసీఆర్‌కు రాజకీయంగా కూడా కలిసి వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఉగ్రవాదం విషయంలో తాను కూడా కఠిన వైఖరితో ఉన్నాననే సంకేతాలను కేసీఆర్‌ పంపారని అంటున్నారు. వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌ ద్వారా ఈ సంకేతాలు చాలా బలంగా కూడా ఉంటాయని అంటున్నారు. ఇక, టీడీపీ విషయంలో స్థానిక బీజేపీ నేతలు విముఖంగా ఉండడం.. ఇప్పుడు మజ్లిస్‌ కూడా అధికార పార్టీకి దూరంగా జరిగే అవకాశం కనిపిస్తుండడంతో భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తుకు సానుకూలంగా అడుగులు పడినట్లు అయిందని అంటున్నారు. తెర వెనుక ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయనే వాదనలు కూడా లేకపోలేదు.