Begin typing your search above and press return to search.

తిరుమలలో వాళ్లను పట్టించుకోవటం లేదట

By:  Tupaki Desk   |   8 Jan 2016 4:56 AM GMT
తిరుమలలో వాళ్లను పట్టించుకోవటం లేదట
X
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణ రాజకీయ ప్రతినిధులకు.. ప్రముఖులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయంపై తెలంగాణ సర్కారు సీరియస్ గా దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా అందరి ప్రముఖులకు ట్రీట్ మెంట్ ఒకేలా ఉండేది. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి వచ్చే ప్రముఖుల ఉత్తరాలకు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసే సిఫార్సు లేఖల్ని తితిదే అధికారులు లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

తిరుమలకు వెళ్లే ప్రముఖులకు తరచూ ఇబ్బందులు ఎదురుకావటం.. వారికి ప్రోటోకాల్ మర్యాదలు జరపటం లేదని.. సీఎం కార్యాలయం ఇచ్చే సిఫార్సు లెటర్స్ ను సైతం లైట్ తీసుకుంటూ బస విషయాన్ని కూడా పట్టించుకోవటం లేదన్న కంప్లైంట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో తెలంగాణ ప్రముఖులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా తెలంగాణ సర్కారు తాజాగా ఒక అధికారికి బాధ్యత అప్పగించటం విశేషం. ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశంకు ఈ బాధ్యత అప్పగించిన కేసీఆర్.. తిరుమలకు వెళ్లి వచ్చిన వారిని కలుసుకొని.. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని కోరటం గమనార్హం. మరి.. దీనిపై ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో?