Begin typing your search above and press return to search.

ఆ విషయంలో బాబు కంటే మొనగాడే

By:  Tupaki Desk   |   19 March 2016 4:50 AM GMT
ఆ విషయంలో బాబు కంటే మొనగాడే
X
ఏదైనా విషయాన్ని గొప్పగా చెప్పుకునే విషయంలో నేతలు ముందుంటారు. అయితే.. నేతలు ఎంతమంది ఉన్నా.. కొందరు మాత్రం తాము చేసిన విషయాల్నే చెప్పుకుంటే.. కొందరు మాత్రం తాము చేయనున్న విషయాల్ని కూడా గొప్పగా చెప్పుకోగలుగుతారు. ప్రచారం విషయంలో వారి పంధానే భిన్నంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రుళ్ల వ్యవహారం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాము చేసిన పనుల కంటే చేయనున్న పనుల గురించి మా గొప్పగా చెప్పుకోవటంలో ఎవరికి వారే సాటి.

తాను నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన నమూనా చిత్రాల్ని.. ఊహా చిత్రాల్ని చూపించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోట మాట రాకుండా చేస్తే.. అలాంటి విషయాల్లో తాను తక్కువేం తినలేదన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు రుజువు చేసుకున్నారు. కళాభారతి భవనం కావొచ్చు.. రవీంద్రభారతి స్థానంలో నిర్మించే భవనానికి సంబంధించిన నమూనా చిత్రాలతో పిచ్చెక్కించిన కేసీఆర్.. తాజాగా అలాంటి నమూనా చిత్రంతో మరోసారి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు.

ఏపీకి తిరుమల మహా పుణ్యక్షేత్రంగా ఉన్నప్పుడు.. తెలంగాణలో ఉన్న విష్ణువాలయమైన యాదాద్రిని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఎందుకు మార్చకూడదన్న బావన రావటం ఆలస్యం.. దాని మీద దృష్టి పెట్టిన కేసీఆర్ మొదటే పేరు మార్చేసి తన మార్క్ ను ప్రదర్శించారు. ఆ తర్వాత మాదాద్రిని అలా చేస్తాం ఇలా చేస్తామంటూ చెప్పిన ఆయన.. ఏపీకి చెందిన కళా దర్శకుడు ఆనంద్ సాయి సహకారంతో అద్భుతమైన డిజైన్లను సిద్ధం చేయించారు.

తాజాగా యాదాద్రిలో జరపబోయే అభివృద్ధి పనుల గురించి రివ్యూ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఆయన.. తాను చెప్పిన అభివృద్ధి పనులన్నీ పూర్తి అయితే.. యాదాద్రి స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా? అంటూ నమూనా చిత్రాన్ని చూపించి అబ్బురపరిచారు. నాలుగు లైన్ల రహదారులు.. అత్యాధునిక కాటేజీలతో పాటు.. పచ్చదనంతో నిండిన వాతావరణంతో యాదాద్రి మహాపుణ్యక్షేత్రంగా మార్చాలన్న సంకల్పాన్ని కేసీఆర్ మరోసారి ఆవిష్కరించారు. ఏమైనా ముఖ్యమంత్రి మాటలకు తగ్గట్లే.. తాజా నమూనా చిత్రం యాదాద్రిని అద్భుతంగా చూపించటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.