Begin typing your search above and press return to search.

కొత్త ట్రెండ్ కు తెర తీసిన కేసీఆర్.. నెహ్రూకు పూలదండ

By:  Tupaki Desk   |   16 Aug 2022 2:30 PM GMT
కొత్త ట్రెండ్ కు తెర తీసిన కేసీఆర్.. నెహ్రూకు పూలదండ
X
మేం మిమ్మల్ని ట్విస్టు చేయటం లేదు. జరిగింది జరిగినట్లు మాత్రమే రిపోర్టు చేస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో గాంధీ విగ్రహాలకు కొరత ఏమైనా ఉందా? అంతదాకా ఎందుకు. తెలంగాణ అసెంబ్లీ భవనం ముందు అంత పెద్ద గాంధీ విగ్రహం ఉంది. దాన్ని వదిలేసి.. అబిడ్స్ చౌరస్తాలోని నెహ్రూ విగ్రహానికి పూలదండ వేయటం ఏమిటి? సాధారణంగా పంద్రాగస్టు వేళ కానీ.. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న కానీ గాంధీ బొమ్మకు పూలదండలు వేయటం ఇంతకాలం చూశాం. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజున చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానూ.. కొత్త చర్చకు తెర తీసేలా మారింది.

ఈ రోజు (మంగళవారం) ఉదయం సరిగ్గా 11.30 గంటల వేళలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అందరూ స్తంభించిపోయి.. నిమిషం పాటు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ సైతం పాల్గొనటం గమనార్హం.

ఆయన అబిడ్స్ చౌరస్తాలో పాల్గొంటారంటూ ప్రకటన విడుదల చేశారు ముందుగా ప్రకటించిన మాదిరే ఉదయం 11.30 గంటలకు కాస్త ముందు వచ్చిన ఆయన సరిగ్గా ఎనిమిది నిమిషాల పాటు అక్కడ పాల్గొన్నారు. అక్కడ ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలదండ వేశారు. జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా 11.30 గంటలకు నాలుగు వైపుల ట్రాఫిక్ నిలిపివేశారు. చివరకు మెట్రో రైల్ సైతం 11.30 గంటల వేళలో.. ఎక్కడికక్కడ ఆగిపోయి.. జాతీయ గీతాలాపన కార్యక్రమం పూర్తి కాగానే తమ ప్రయాణాన్ని కొనసాగించాయి.

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. ఎలాంటి ప్రసంగం లేకుండానే తిరిగి వెళ్లిపోయారు. అక్కడకు మూడు కిలోమీటర్ దూరంలోనే అసెంబ్లీ ప్రాంగణం ఉంది. అక్కడే పెద్ద గాంధీ బొమ్మ ఉంది. నాలుగు కూడలి రోడ్డు ఉంది. ఇన్ని ఉన్నా.. అవన్నీ వదిలేసి.. అబిడ్స్ ఎందుకు వెళ్లినట్లు? అన్నదిప్పుడు ప్రశ్న. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అబిడ్స్ ప్రాంతం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోనిది. గ్రేటర్ హైదరాబాద్ లోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్ని చూస్తే.. అందులో ఏడు నియోజకవర్గాల్లో తన మిత్రుడైన మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే.. మరొక చోట మాత్రమే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన 15 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు చెందిన వారే.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే గోషామహల్. హైదరాబాద్ మహానగరంలో అన్ని ప్రాంతాలు ఉంటే వాటిని వదిలేసి.. అబిడ్స్ కు వెళ్లటానికి కారణం.. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని ఈసారి తాము ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వటం కోసమంటున్నారు.

మరో ట్విస్టు ఏమంటే.. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో బోలెడన్ని గాంధీ విగ్రహాలు ఉన్నాయి. వాటిని వదిలేసి.. అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహానికి పూలదండ వేయటం సరికొత్త రాజకీయం కోసమేనా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఏమైనా అందరూ గాంధీ బొమ్మకు పూలదండ వేసే వేళ.. కేసీఆర్ మాత్రం కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేలా నెహ్రు విగ్రహానికి పూలమాల వేసిన తీరు చూస్తే.. ఎన్నాళ్లకు నెహ్రు విగ్రహానికి పూలమాల పడిందన్న భావన కలగటం ఖాయం.