Begin typing your search above and press return to search.

గులాబీ దండుపై స‌ర్వే బాంబు విసిరిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   22 Jan 2018 9:38 AM GMT
గులాబీ దండుపై స‌ర్వే బాంబు విసిరిన కేసీఆర్‌
X
ప్ర‌త్య‌ర్థుల‌కే కాదు సొంత పార్టీ నేత‌ల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ప్ర‌భుత్వంపై ప‌ట్టును సాధించ‌ట‌మే కాదు.. ప్ర‌జ‌ల మ‌నసుల్ని గెలుచుకోవ‌టంలో ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యార‌న్న పేరు ప్ర‌ఖ్యాతల్ని సొంతం చేసుకున్నారు. మ‌రో ఏడాది వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. స‌రికొత్త ఎత్తుగ‌డ‌ను సిద్ధం చేసుకునేందుకు కేసీఆర్ క‌స‌ర‌త్తు మొద‌లెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

వంద సీట్ల‌కు పైనే గెలుస్తామ‌న్న ధీమాలో ఉన్న కేసీఆర్‌.. తాను చెప్పిన మాట క‌చ్ఛితంగా జ‌రిగేందుకు వీలుగా స‌ర్వేల‌ను న‌మ్ముకున్న‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప‌ర‌ప‌తి ఎంతుంది? పార్టీ నేత‌ల‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఎంత‌? ఎన్నిక‌ల‌కు పార్టీ ఎలా స‌మాయుత్తం కావాలి? ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ప్ర‌జ‌ల స్పంద‌న ఎలా ఉంద‌న్న అంశాన్ని తెలుసుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కోట్లాది రూపాయిల ఖ‌ర్చుతో ప్రైవేటు సంస్థ‌ల చేత భారీ ఎత్తున స‌ర్వేలు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టికే స‌ర్వేలు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. వాటి శాంపిల్ సైజు చాలా చిన్న‌వ‌ని.. అందుకే తాజా స‌ర్వే ఇందుకు భిన్నంగా భారీగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. మొత్తం మూడు ద‌శ‌ల్లో సాగే ఈ స‌ర్వే.. ఈ నెలాఖ‌రు లోపు పూర్తి చేసి.. తుది నివేదిక కేసీఆర్ వ‌ద్ద‌కు చేరుతుంద‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ని తీరును మ‌దింపు చేయ‌టంతో పాటు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ ఎంత‌న్న విష‌యంతో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు తాజా స‌ర్వే కీల‌క‌భూమిక పోషించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ స‌మాచారం పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 90 శాతం సిట్టింగ్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు టికెట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ మాట‌ల్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇందులో భాగంగా మూడు భాగాలుగా స‌ర్వేను చేప‌ట్టిన‌ట్లుగా స‌మాచారం.

గ‌తంలో నిర్వ‌హించిన శాంపిల్ స‌ర్వేల సైజు చాలా చిన్న‌ద‌ని.. 250 నుంచి 300 మంది వ‌ర‌కే సంప్ర‌దించార‌ని.. ఇందుకు భిన్నంగా ఈసారి ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో త‌క్కువ‌లో త‌క్కువ 3 వేల మంది వ‌ర‌కూ అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని.. మొత్తం3.5 ల‌క్ష‌ల మంది అభిప్రాయాన్ని తెలుసుకోవాల‌న్న ఆదేశాన్ని ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

మొద‌టి స‌ర్వేలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరు ఎలా సాగుతుందో తెలుసుకోవ‌టం కాగా.. రెండో స‌ర్వేలో పార్టీ ప‌ని తీరును మ‌దింపు చేస్తారు. మూడో స‌ర్వేలో ప్ర‌జాప్ర‌తినిధుల ప‌ని తీరును లెక్కేస్తారు. ఎవ‌రు చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీపైనా.. నియోజ‌క‌వ‌ర్గంపైనా ఎవ‌రికెంత‌ ప‌ట్టు ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకుంటారు. దీని ఆధారంగానే టికెట్ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తార‌ని చెప్పొచ్చు. ఈ స‌ర్వేల‌కు తోడు నిఘా వ‌ర్గాలు అందించే రిపోర్టులు ఉండ‌నే ఉన్నాయి. బ‌రిలోకి దిగే ప్ర‌తి ఒక్క నేత‌ గెలుపు గుర్రంలా మారి.. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించాల‌న్న‌దే కేసీఆర్ ల‌క్ష్యంగా చెబుతున్నారు. అందుకే ఇంత భారీగా స‌ర్వేలు చేయిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశించిన స‌ర్వే ముచ్చ‌ట గులాబీ నేత‌ల్లో భారీ చ‌ర్చ‌కు తెర తీయ‌టమే కాదు.. కొత్త టెన్ష‌న్ ను పుట్టిస్తోంది.