Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు జీఎస్టీ ఎంత లాభ‌మో చెబుతున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   4 July 2017 4:30 AM GMT
తెలంగాణ‌కు జీఎస్టీ ఎంత లాభ‌మో చెబుతున్న కేసీఆర్‌
X
తాను మ‌ద్ద‌తు ఇచ్చింది ఏదైనా.. అది ఎలాంటిదైనా అందుకు అండ‌గా నిల‌బ‌డి త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించే ల‌క్ష‌ణం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బాగా అల‌వాటు. పెద్ద నోట్ల ర‌ద్దు మీద ప‌లువురు అధినేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా గ‌ళం విప్పిన మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌ను చెప్పాలి. తాజాగా జీఎస్టీ విష‌యంలోనూ ఆయ‌న అదే తీరులో త‌న గ‌ళాన్ని వినిపిస్తున్నారు.

ఓప‌క్క జీఎస్టీ కార‌ణంగా తెలంగాణ రాష్ట్రానికి న‌ష్టం వాటిల్లుతుంద‌ని.. ఆదాయం త‌గ్గుతుంద‌న్న ఆందోళ‌న‌ను రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ వ్య‌క్తం చేస్తుంటే.. అందుకు భిన్నమైన వాద‌న‌ను వినిపిస్తున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఏదైనా ముఖ్య‌మైన విష‌యం మీద చ‌ర్చ నిర్వ‌హించాల‌ని అనుకున్న‌ప్పుడు తాను న‌మ్మిన వారంద‌రిని కూర్చోబెట్టుకొని స‌ద‌రు అంశం మీద చ‌ర్చ జ‌ర‌ప‌టం కేసీఆర్ కు అల‌వాటే.

తాజాగా అలాంటి చ‌ర్చే జీఎస్టీ మీద ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశానికి కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉండే కేకే మొద‌లుకొని సీఎం పేషీలో కేసీఆర్ కు నిత్యం అందుబాటులో ఉండే ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ‌.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్ పీ సింగ్‌.. సీనియ‌ర్ అధికారులు ఎస్‌.న‌ర్సింగ‌రావు.. సోమేశ్ కుమార్‌.. రామ‌కృష్ణారావు.. అనిల్ కుమార్ వాణిజ్య సీనియ‌ర్ అధికారులతో ఆయ‌న స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

జీఎస్టీ వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగే లాభం ఎంత‌న్న లెక్క వేయ‌టం ఈ స‌మావేశంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఓప‌క్క జీఎస్టీ వ‌ల్ల వంద‌లాది కోట్ల రూపాయిల న‌ష్టం తెలంగాణ ఖ‌జానాకు వాటిల్లుతుంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్న ఈటెల మాట‌ల‌కు కౌంట‌ర్ వాద‌న‌ను కేసీఆర్ వినిపించ‌టం విశేషం.

జీఎస్టీ నుంచి పెట్రోలియం.. ఎక్సైజ్ అంశాల్ని మిన‌హాయించ‌టంతో రాష్ట్రానికి వ‌చ్చే 50 శాతం ఆదాయంపై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని.. మిగిలిన 50 శాతంలోనూ కేంద్రం నుంచి స‌గం.. రాష్ట్రానికి నేరుగా స‌గం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు. జీఎస్టీతో కేంద్రానికి పెరిగిన ఆదాయాన్ని రాష్ట్రాల‌కు వాటా పంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందువ‌ల్ల తెలంగాణ‌కు క‌చ్ఛితంగా కేటాయింపు పెరిగి తీరుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అధికారులు వేసిన ప్రాధ‌మిక లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌కు జీఎస్టీ కార‌ణంగా ఏటా రూ.2 వేల నుంచి రూ.3వేల కోట్ల మేర అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌ను కేసీఆర్ వినిపించ‌టం గ‌మ‌నార్హం.

జీఎస్టీ మీద వ్యాపారులు.. ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని కేసీఆర్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎంత ప‌న్ను చెల్లించాల‌న్న విష‌యంపై వ్యాపారులు.. వ‌ర్త‌కులు.. ప్ర‌జ‌ల‌కున్న డౌట్స్ ను తీర్చేలా చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల అవ‌గాహ‌న కంటే కూడా.. కేసీఆరే క‌లుగ‌జేసుకొని ఓ గంట స్పెష‌ల్ జీఎస్టీ క్లాస్ తీసుకుంటే.. అర‌టిపండు ఒలిచి మ‌రీ నోట్లో పెట్టిన‌ట్లుగా ప్ర‌జ‌లు ఫీల‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రి ఆ ప‌ని కేసీఆర్ చేస్తే ఎంత బాగుండు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/