Begin typing your search above and press return to search.

చీర‌ల్ని కాల్చేటోళ్ల మీద అలాంటి కేసులు?

By:  Tupaki Desk   |   19 Sep 2017 4:29 AM GMT
చీర‌ల్ని కాల్చేటోళ్ల మీద అలాంటి కేసులు?
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌ల మ‌న‌సుల్ని దోచుకునేందుకు బ‌తుక‌మ్మ చీర‌ల్ని పంపిణీ చేయాల‌న్న కాన్సెప్ట్ మీద కేసీఆర్ అండ్ కో చాలానే ఆశ‌ల్ని పెట్టుకుంది. చీర‌ల పంపిణీ సంద‌ర్భంగా చిన్న చిన్న గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని ఊహించిన స‌ర్కారు.. చీర‌ల్ని కాల్చేసి నిర‌స‌న‌లు తెలియ‌జేసే వ‌ర‌కూ వెళ‌తాయ‌న్న‌ది అస్స‌లు అనుకోలేదు.

చీర‌ల్ని పోగుపోసి మ‌రీ త‌గ‌లేయ‌టం.. ఆ సీన్లు టీవీల్లో ప్ర‌ముఖంగా రావ‌టంపై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి మ‌రీ వాయించిన‌ట్లుగా స‌మాచారం. వెనువెంట‌నే.. మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. తాము పంపిణీ చేసిన చీర‌లకు అనూహ్య స్పంద‌న ల‌భించిన‌ట్లుగా చెబుతూ.. నిర‌స‌న‌ల్ని మాత్రం ప్ర‌తిప‌క్షాల ఖాతాకు మ‌ళ్లించేశారు కేటీఆర్‌.

నిర‌స‌న‌లు తెలిపిన వారు సైతం త‌ర్వాత చీర‌లు తీసుకెళ్లార‌న్నారు. చీర‌ల పంపిణీ వేళ‌.. మ‌హిళ‌లు శాప‌నార్థాలు పెడుతున్న వైనం టీవీల్లో ప్ర‌సారం కావ‌టంపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న చీర‌ల పంపిణీపై నెగిటివ్ రిపోర్టులు ఎలా ఇస్తారంటూ మండిప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. చీర‌ల పంపిణీపై నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న ఆదేశాన్ని జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా చీర‌ల్ని త‌గ‌ల‌బెట్టే వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని.. నాన్ బెయిల్ బుల్ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టాల‌న్న మాట చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. చీర‌ల‌పై నిర‌స‌న‌ల‌న్నీ విప‌క్షాల కుట్ర‌గా అభివ‌ర్ణించ‌టంతో పాటు.. కుట్ర కోణాన్ని బ‌య‌ట‌పెట్టాలంటూ పార్టీ నేత‌ల‌కు సూచ‌న చేసిన‌ట్లుగా చెబుతున్నారు. గొడ‌వ‌లు జ‌రిగిన చోట మ‌హిళ‌ల‌పై నాన్ బెయిలబుల్ కేసులు న‌మోదు చేస్తే మొద‌టికే మోసం రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఈ త‌ర‌హా కేసుల‌తో ఇష్యూ మ‌రింత ర‌చ్చ అవుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.