Begin typing your search above and press return to search.

నయాం ఎపిసోడ్ లో కేసీఆర్ కొత్త ట్విస్ట్

By:  Tupaki Desk   |   8 Jan 2017 7:08 AM GMT
నయాం ఎపిసోడ్ లో కేసీఆర్ కొత్త ట్విస్ట్
X
మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నయిం ఎన్ కౌంటర్.. తదనంతర పరిణామాలు.. నయింతో పోలీసు అధికారులు.. రాజకీయ నేతలకు మధ్యనున్న సంబంధాలపై ఇటీవల ప్రభుత్వం తరఫున దర్యాఫ్తు అధికారులు దాఖలు చేసిన ప్రమాణపత్రం చాలామందికి షాకిచ్చింది. నయింతో పెద్ద ఎత్తున పోలీసు.. రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నాయని.. పోలీసు విచారణలో అవన్నీ బయటకు వస్తాయని భావించారు. అయితే.. అందుకు భిన్నంగా అలాంటి ఆధారాలు తమ వద్ద లేవన్న వాదనను విచారణ అధికారులు వెల్లడించారు.

దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నయిం తో సంబంధాలు ఉన్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. ఇంతకంటే దారుణం మరొకటి లేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం దాఖలు చేసిన ప్రమాణపత్రంతో కేసీఆర్ సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసిందన్న వాదన వినిపించింది. అయితే.. ఈ అంశంపై నోరు మెదపని కేసీఆర్ సర్కారు.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

నయింతో సంబంధం ఉన్న రాజకీయ నేతలు.. పోలీసు అధికారులపై చర్యలు మొదలైతే.. ఇబ్బందికరంగా మారుతుందని.. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారన్న భావన వ్యక్తమవుతోంది. ఈ కారణంతోనే అసెంబ్లీ సమావేశాల సమయంలో అనవసరమైన లొల్లిని తెర మీదకు రాకుండా ఉండేందుకు మధ్యే మార్గాన్ని అనుసరించారని.. కానీ.. సమావేశాలు ముగిసిన వెంటనే బాధ్యులపై చర్యలు ఉంటాయని.. అందుకు తగ్గట్లే అధికారిక నిర్ణయాన్ని ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

విపక్షాలకు చెందిన నేతలతో పాటు.. అధికారపక్షానికి చెందిన నేతలతోనూ నయింకు సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక.. పోలీసు శాఖలోని వివిధ హోదాలకు చెందిన అధికారులతో సంబంధాలు ఉన్నాయని.. వాటికి తగిన ఆధారాల్ని ఇప్పటికే సేకరించినట్లుగా తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే.. నయింతో అంటకాగిన వారిని పక్షపాత రహితంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికైతే గుట్టు చప్పుడు కాకుండా ఉండి.. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన వెంటనే తదుపరి చర్యలు ఉంటాయన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. మరిన్ని సంచలన అంశాలు తెర మీదకు రావటమే కాదు.. రాజకీయంగా కూడా పెనుదుమారంగా మారటం ఖాయమని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/