Begin typing your search above and press return to search.

శ్రీవారికి కేసీఆర్ మొక్కు నగలు రెఢీ

By:  Tupaki Desk   |   7 April 2016 6:07 AM GMT
శ్రీవారికి కేసీఆర్ మొక్కు నగలు రెఢీ
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వామి వారికి పలు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని మొక్కులు మొక్కుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కుకు తగ్గట్లే తాజాగా బంగారునగల్ని తయారు చేయించారు. వీటిని టీటీడీకి అందజేశారు. అయితే.. స్వామివారికి స్వయంగా అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆయన ఏప్రిల్ నెలాఖరులో తిరుమలకు వెళ్లనున్నారు. అయితే.. ఏ రోజున ఆయన ప్రయాణం ఉంటుందన్నది ఇంకా నిర్ణయం కాలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తిరుమలేశుడికి తాను సమర్పిస్తానని చెప్పిన బంగారు ఆభరణాల కోసం రూ.5కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కేసీఆర్ మొక్కకున్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. 22 కేరట్ల మేలిమి బంగారంతో 14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని తయారు చేయించారు. ఇందుకోసం రూ.3.7 కోట్లు ఖర్చుఅయ్యినట్లు చెబుతున్నారు. ఇక.. 4.65కిలోల బరువుతో ఐదు పేటల కంఠాభరణాలను తయారుచేయించాలన్న మొక్కుకు తగినట్లుగా ఆభరణాల్ని సిద్ధం చేశారు. వీటి తయారీ కోసం టెండర్లు పిలవగా.. కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ జ్యూవెల్లర్స్ అయిన కీర్తిలాల్ కాళిదాస్ జ్యూయలర్స్ సంస్థ ఈ టెండర్ ను చేజిక్కించుకుంది.

సదరు సంస్థ ఈ మధ్యనే తిరుమల శ్రీవారికి ఈ ఆభరణాల్నిచేర్చింది. కేసీఆర్ మొక్కుల్ని అందుకున్న టీటీడీ.. ఆయన స్వయంగా వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిస్తే బాగుంటుందన్న భావన వ్యక్తం చేయటంతో.. ఆయన తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో కేసీఆర్ తిరుమల పర్యటన ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా మరోసారి ఏపీ గడ్డ మీద కేసీఆర్ అడుగు పెట్టటం ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆసక్తికరంగా మారుతుందనటంలో సందేహం లేదు.