Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ కాల్ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   13 July 2017 3:59 PM GMT
ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ కాల్ వ‌చ్చింది
X
అధికార పార్టీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొర‌క‌టం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కాదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విష‌యం ఇందుకు భిన్నం. ఎమ్మెల్యే ఏంటి ఖ‌ర్మ‌.. చివ‌ర‌కు మంత్రుల‌కు సైతం ఆయ‌న అపాయింట్ మెంట్ దొర‌క‌టం చాలా క‌ష్టం. కేసీఆర్ కోరుకుంటే త‌ప్పించి.. ఎవ‌రు కోరుకున్నా ఆయ‌న ద‌ర్శ‌న భాగ్యం ల‌భించద‌న్న విమ‌ర్శ ఉంది.

ఇలాంటి టాక్ ఉన్న నేప‌థ్యంలో కేసీఆర్ నుంచి పిలుపు వ‌చ్చినా ఉలిక్కిప‌డే వారు చాలామందే ఉన్నారు. సాధార‌ణంగా ఎవ‌రికీ పిలుపు రాని వేళ‌లో.. ప్ర‌త్యేకించి పిలిస్తే ఏదో ఒక‌టి ఉన్న‌ట్లేన‌ని చెబుతారు. శుభ‌వార్త‌ల కంటే కూడా.. ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌రిస్థితి ఉంటేనే పిలుపులు వ‌చ్చాయ‌ని చెబుతారు. పార్టీ నేత‌ల‌కే కాదు.. అధికారుల విష‌యంలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని చెబుతారు.

మొద‌ట్లో కేసీఆర్ తీరు అర్థం కాక‌.. చాలామంది ఆయ‌న పిలుపు కోసం ఎదురు చూసేవారు. కానీ.. కాలం గ‌డుస్తున్న కొద్దీ.. వీలైనంత‌వ‌ర‌కూ పిలుపు రాకుంటే చాల‌న్న మాట‌ను ప‌లువురు చెబుతుంటారు. ఒంట‌రి పిలుపుల కంటే కూడా బృంద పిలుపులే బెట‌ర్ అని చెబుతారు. ఏదైనా కీల‌క విష‌యాలు చ‌ర్చించాల‌న్నా.. కొత్త నిర్ణ‌యం తీసుకునే వేళ‌లో అంద‌రి అభిప్రాయాలు తెలుసుకునేందుకు బృంద చ‌ర్చ‌లు పెడ‌తార‌ని చెబుతారు. అందుకే ఒంట‌రి పిలుపులు వీలైనంత వ‌ర‌కూ రాకూడ‌ద‌న్న అనుకుంటున్న వేళ‌.. మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ కు సీఎం నుంచి పిలుపు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

హ‌రిత హారం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రీతి మీనా ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వేళ‌లో సీఎం నుంచి కాల్ రావ‌టం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. ప్ర‌భుత్వ ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బ తీసిన ఎమ్మెల్యే పై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు చెబుతున్న వేళ‌..త‌న‌ను క‌ల‌వాల్సిందిగా కేసీఆర్ నుంచి పిలుపు రావ‌టం చూస్తే.. శంక‌ర్ నాయ‌క్‌ కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌ప్ప‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కొంత‌మంది టీఆర్ ఎస్ నేత‌లు త‌న‌పై కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. పార్టీ ఒత్తిడి మేర‌కే క్ష‌మాప‌ణ‌లు చెప్పాన‌న్న ఆయ‌న‌.. సారీ చెప్పాక కూడా రాత్రికి రాత్రి కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేయ‌టం బాధాక‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. క‌లెక్ట‌ర్ త‌న‌కు సోద‌రి లాంటిద‌న్నారు.