Begin typing your search above and press return to search.

గులాబీ పందెం కోళ్లకు ఫోన్ చేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   14 Sep 2018 5:05 AM GMT
గులాబీ పందెం కోళ్లకు ఫోన్ చేసిన కేసీఆర్‌
X
ముంద‌స్తుకు వెళుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. ఆ త‌ర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత నిర్వ‌హించిన స‌భ‌ల‌కు హాజ‌రైన ఆయ‌న‌.. హైద‌రాబాద్ కు వ‌చ్చింది లేదు. ముంద‌స్తు క‌స‌ర‌త్తు మొత్తం ఫామ్ హౌస్ సాక్షిగా చేప‌ట్టిన కేసీఆర్‌.. పండుగ వేళ పెద్ద ప‌నినే పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ముంద‌స్తు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న విష‌యంలో ఊహించ‌ని రీతిలో 105 మంది పేర్ల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ పెను రాజ‌కీయ సంచ‌ల‌నానికి తెర తీశారు. అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత అసంతృప్తితో ఆగ్ర‌హ జ్వాల‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. బుజ్జ‌గింపుల ప‌ర్వాన్ని షురూ చేశారు. ఇదిలా ఉండ‌గా.. బ‌రిలోకి దిగిన 105 మంది అభ్య‌ర్థుల‌కు ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ఫోన్లు చేశారు.

ఒక్కో అభ్య‌ర్థితో నాలుగైదు నిమిషాల పాటు మాట్లాడిన ఆయ‌న‌..ప్ర‌చారం ఎలా సాగుతుంద‌న్న విష‌యంతో పాటు.. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన అంశాల్ని ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఓట‌ర్ల న‌మోదు కార్య‌క్ర‌మాన్ని అభ్య‌ర్థులు సీరియ‌స్ గా తీసుకోవాల‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. బూత్ క‌మిటీల నియామ‌కాల‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అసంతృప్తుల్ని బుజ్జ‌గించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌న్న అభ‌యాన్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఓట‌ర్ల న‌మోదు విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి.. వీలైనంత ఎక్కువ‌గా ఓట‌ర్ల‌ను చేర్చాల‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఉన్న ఓట‌ర్లు అసంతృప్తితో ఉన్న వేళ‌.. కొత్త ఓట‌ర్ల‌ను చేర్చ‌టం ద్వారా వారి మ‌న‌సుల్ని దోచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి.. కొత్త ఓట‌ర్లు కేసీఆర్ ఆశ‌ల్ని ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి.. పండ‌గ‌పూట కేసీఆర్ పెద్ద ప‌నే పెట్టుకున్నారే!