Begin typing your search above and press return to search.

కేసీఆర్ మదిలోని మంత్రులు వీళ్లేనా?

By:  Tupaki Desk   |   15 Feb 2019 10:19 AM GMT
కేసీఆర్ మదిలోని మంత్రులు వీళ్లేనా?
X
మంచితరుణం వచ్చేసింది. తెలంగాణ ఎమ్మెల్యేల పంట పండబోతోంది. అఖండ మెజార్టీతో గెలిచిన గులాబీ ఎమ్మెల్యేలు తమకు మంత్రి యోగం పడుతుందని కలలు గన్నారు. రెండోసారి గెలిచినవాళ్లు - సీనియర్లు కూడా మంత్రి పదవులపై బోలెడు ఆశలు పెంచుకున్నారు. కానీ కేసీఆర్ గద్దెనెక్కాక తనతోపాటు మహమూద్ అలీని మాత్రమే మైనార్టీ కోటాలో మంత్రిగా తీసుకొని ఇక విస్తరణనే మరిచిపోయాడు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 66వ రోజున కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. 19న కేబినెట్ ను విస్తరించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. తొలిదఫాలో 10మందికి మంత్రి యోగం పట్టనుందని.. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ ఉంటుందని వార్తలొస్తున్నాయి.

మరి కేసీఆర్ మదిలో ఉన్న 10 మంది మంత్రులెవ్వరన్నది ఆ బ్రహ్మ దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే కేసీఆర్ లాంటి అపర రాజకీయ చాణక్యుడిని ఆలోచనలు పసిగట్టడం ఎవ్వరికీ సాధ్యం కాని పని.. కానీ కేసీఆర్ సన్నిహితులు - టీఆర్ ఎస్ ముఖ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. 18వ తేదీని స్వయంగా కేసీఆరే ఫోన్ చేసి కొత్త మంత్రులకు తీపికబురు చెబుతాడని.. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే మంత్రులెవరో తేలనుందట..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాత జిల్లాల వారీగా సామాజిక కుల సమీకరణాలు - మహిళా కోటాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మంత్రి పదవులు భర్తీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

* ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు దక్కే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వీరేనట..

1. ఆదిలాబాద్ : బాల్క సుమన్ (ఎస్సీ కోటాలో) లేదా అజ్మీరా రేఖానాయక్ (మహిళా - ఎస్టీ కోటాలో)
2. కరీంనగర్ : కేటీఆర్ - ఈటల రాజేందర్ .. వీరితోపాటు కొప్పుల ఈశ్వర్ కు చాన్స్
3. వరంగల్ : ఎర్రబెల్లి దయాకర్ రావు
4. నిజామాబాద్ : ప్రశాంత్ రెడ్డి
5. మెదక్ : హరీష్ రావు - పద్మా దేవేందర్ రెడ్డి
6. నల్గొండ : జగదీశ్వర్ రెడ్డి లేదా గొంగడి సునీత
7. రంగారెడ్డి : పట్నం నరేందర్ రెడ్డి
8. మహబూబ్ నగర్ : లక్ష్మా రెడ్డి లేదా శ్రీనివాస్ గౌడ్
9. హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్
10. ఖమ్మం : పువ్వాడ అజయ్ లేదా తుమ్మల నాగేశ్వరరావు..

పాత జిల్లాల వారీగా కుల - సామాజిక - మహిళా కోటాలో ప్రస్తుతానికి 10 మంది మంత్రులను తీసుకోబోతున్నట్టు తెలిసింది. దాదాపుగా వీరిలోనే 10మంది మంత్రులు అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇందులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓడించిన పట్నం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక ఎస్టీ మహిళా కోటాలో అజ్మీరా రేఖానాయక్ లు చాన్స్ ఉందట.. మంత్రివర్గంలో వీరు ఇద్దరే కొత్త వారే కావడం గమనార్హం.