Begin typing your search above and press return to search.

మోడీకి ఇంకో తీపిక‌బురు చెప్ప‌నున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   17 May 2017 12:33 PM GMT
మోడీకి ఇంకో తీపిక‌బురు చెప్ప‌నున్న కేసీఆర్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రో తీపిక‌బురు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఆనుగుణంగా జనవరి నుండి డిసెంబర్‌ వరకు బడ్జెట్‌ పద్ధతి ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఈ మేరకు సంబంధిత శాఖాధిపతులతో చర్చలు పూర్తి చేశారని స‌మాచారం. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు బడ్జెట్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని భావించారు. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ - ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్టారావు ఇతర అధికారుల బృందాన్ని మధ్యప్రదేశ్‌ కు వెళ్లి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కేంద్ర పథకాలు, రాబోవు జీఎస్‌ టీతో పాటుగా ఇతర లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న పక్షంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్నే పాటించాలని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిసెంబర్‌ లో బడ్జెట్‌ ను శాసనసభలో ప్రవేశపెట్టి జనవరి నుండి అమలు జరిపే విధంగా చర్యలు తీసుకొనడం ఉత్తమం అని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జీఎస్‌ టీ విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చినట్టుగానే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపడానికి కలిసి రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ కోరడంతో దేశంలోని 29రాష్ట్రాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఆనుగుణంగా జనవరి నుండి డిసెంబర్‌ వరకు బడ్జెట్‌ పద్ధతి ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా కేంద్ర ప్రభుత్వంతోనే ముడివడి ఉన్నందున కేంద్రం మార్గదర్శకాల మేరకే వ్యవహరించడం మంచిదనే అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని రెండు మాసాలు ముందుకు జరపడం వల్ల జరగే నష్టమేమి ఉండ‌బోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఆర్థిక సంవత్సరం పాటించాలని ఈ రెండు కమిటీలు తమ నివేదికలో పేర్కొన్నా యి. దానిపైన కేంద్రం వివిధ రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం ఆలోచనకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరుపుకొనేందుకు సానుకూలతను వ్యక్తం చేశాయి.

కాగా తాజా స‌వ‌ర‌ణ ప్ర‌కారం గత మార్చిలో ఆమోదించిన 2017 -18 వార్షిక బడ్జెట్‌ కాల పరిమితిని డిసెంబర్‌ 31 నాటికి కుదించవలసి ఉంటుంది. జనవరి నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం అవసరం . అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిధుల కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, చివరి త్రైమాసిక ఆదాయ వ్యయాలు ఇక మీదట తొలి త్రైమాసికంగా పరిగణించడం జరుగుతుంది. ఈ సర్దుబాటు తొలి సంవత్సరానికే పరిమితమని, 2019 -20లో సమస్య ఉత్పన్నం కాబోదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/