Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ!

By:  Tupaki Desk   |   21 July 2020 2:00 PM GMT
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ!
X
రాజకీయ వ్యూహాల్ని సిద్ధం చేయటం.. వాటిని విజయవంతంగా అమలు చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా చేయటంలో ఆయనకు మించిన అధినేత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడైతే లేరనే చెప్పాలి. ఏదైనా అంశంపై ఫోకస్ పెట్టారంటే.. దాని లెక్క చూసే వరకు నిద్రపోని తత్త్వం కేసీఆర్ సొంతం.

తాజాగా అలాంటి మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తేయటం.. తేడా వచ్చినంతనే పాతాళానికి తొక్కే విషయంలో ఎలాంటి కనికరం చూపరు కేసీఆర్. అదే సమయంలో సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం..తన వాదనలతో అందరిని కన్వీన్స్ చేసే లక్షణం కేసీఆర్ లో ఎంత ఉందన్న విషయం పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.

ఉద్యమ నేతగా ఉన్నప్పుడు పీవీని అదే పనిగా విమర్శించటమే కాదు.. ఘాటు వ్యాఖ్యల్ని చేశారు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీని తమ పార్టీ నేతగా మార్చుకోవటం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బ తీయాలన్న వ్యూహాన్ని సిద్ధం చేసిన ఆయన.. పీవీ శతజయంతి ఉత్సవాల్ని తనకు అనుకూలంగా మార్చకోవటం తెలిసిందే. ఊహించని రీతిలో పీవీ శతజయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తామని చెప్పటమే కాదు.. కోట్లాది రూపాయిల్ని అప్పటికప్పుడు విడుదల చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఏడాది పొడువుగా పీవీ శత జయంతి సందర్భంగా తమ ప్రభుత్వం ఏమేం చేయనుందన్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన ఆయన.. పీవీని తమ పార్టీ అక్కున చేర్చుకున్నంతగా మరెవరూ చేయలేదన్న భావనను ప్రజల్లో కలిగేలా చేశారు. తాను బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ వాదిగా నిలిచిన పీవీని.. ఆ పార్టీకి దూరం చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కేసీఆర్ తీరును జీర్ణించుకోలేకపోతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ పార్టీకి చెందిన పీవీ గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పీవీ కుటుంబ సభ్యులే స్పందించని వేళ.. ప్రజలు ఎంతమేర స్పందిస్తారన్నది ప్రశ్న.

ఇదిలా ఉండగా.. త్వరలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ ఖాళీల్ని భర్తీ చేయనున్నారు. తాజాగా తనకు అందివచ్చిన అవకాశాన్ని మరింతగా వినియోగించుకునే క్రమంలో.. దివింగత పీవీ కుమార్తె వాణి దేవిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. తాను తీసుకున్న ఒక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. పీవీ విషయంలో తనకున్నకమిట్ మెంట్ ఎంత సీరియస్ అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసినట్లుగా భావిస్తున్నారు. కేసీఆర్ తాజా నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి మాస్టర్ స్ట్రోక్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.