Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందంటే..

By:  Tupaki Desk   |   11 July 2016 5:36 AM GMT
కేసీఆర్ ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందంటే..
X
46 కోట్ల మాటను.. అంకెలో వేసేందుకు ప్రయత్నించండి. మొదటి ప్రయత్నంలోనే ఈ అంకెను పక్కాగా వేయగలిగేవారు చాలా తక్కువ మందే ఉంటారు. మరి.. అన్ని కోట్ల మొక్కల్ని తయారు చేయించాలంటే..? ఎంత కష్టం.. ఎంత ముందుచూపు ఉండాలో. ఇలాంటి కష్టమైన.. క్లిష్టమైన పనుల్ని పూర్తి చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఏదైనా అంశాన్ని కేసీఆర్ టేకప్ చేశారంటే దాన్ని పూర్తి చేసేంతవరకూ వదిలిపెట్టరు. ఆచరణలో ఇబ్బందులు ఎదురైనా.. ఏదోలా వాటిని అధిగమించాలే తప్పించి వదిలిపెట్టేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. విపక్షంగా ఉంటూ.. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే ఉన్న ఈ అలవాటుకు అధికారం తోడైతే మరెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇందుకు నిదర్శనంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరధ కావొచ్చు.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అయి ఉండొచ్చు.. ప్రాజెక్టు రీ డిజైనింగ్.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా.. భారీగా.. కష్టసాధ్యమన్నట్లుగా ఉండటం కనిపిస్తుంది. అయితే.. వీటన్నింటిని పూర్తి చేస్తామన్న సంపూర్ణ విశ్వాసాన్నిప్రదర్శిస్తారు కేసీఆర్. తాజాగా ఆయన హరిహారం అంటూ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 46 కోట్ల చెట్లను నాటించాలన్న బృహత్ సంకల్పానికి తెర తీశారు. ఈ కార్యక్రమంలో తొలి రోజునేలక్షలాది చెట్లను నాటేందుకు పిలుపునిచ్చిన కేసీఆర్.. ఈ రోజు (సోమవారం) ఒక్క రోజులో 30లక్షల మొక్కల్ని నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

మరి.. ఇందుకోసం అవసరమైన మొక్కల్నిసిద్ధం చేయించటం అంత చిన్న విషయం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇన్నేసి కోట్ల మొక్కల్ని ఎలా తయారు చేశారు? ఇందుకోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయన్న విషయంపై దృష్టి సారిస్తే ఆశ్చర్యకర సంగతులు చాలానే బయటకు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భారీగా ప్రచారం చేస్తున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక రెండేళ్ల క్రితమే మొదలైంది. ఒక సీజన్ లో 46 కోట్ల మొక్కల్ని నాటటం అంటే అన్నేసి మొక్కల్ని తయారు చేయటం చిన్న విషయం కాదు. ఇందుకోసం కేసీఆర్ సర్కారు ఎంతో ముందుచూపుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4213 నర్సరీలను సిద్ధం చేసింది.

ఏడాది ముందు నుంచి ఈ నర్సరీలకు అవసరమైన విత్తనాలు.. వాటిని నాటేందుకు అవసరమైన మట్టి.. ప్లాస్టిక్ సంచులు.. లాంటి ఏర్పాట్లను చేసింది. ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టటంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రెండు గ్రామాలకు ఒక నర్సరీ ఏర్పాటైన పరిస్థితి. ఈ నర్సరీల్లో197 రకాల చెట్లను పెంచటం ఒక విశేషంగా చెప్పాలి. మొక్కలు నాటిన తర్వాత వాటిని బాధ్యతగా పర్యవేక్షించేందుకు వీలుగా గ్రామస్థాయిలో పొదుపు సంఘాలను ఎంపిక చేశారు. వీరికి ప్రతి మొక్కను పర్యవేక్షించేందుకు రూ.5 చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నరు. అంతేకాదు.. వీరు చెట్లకు నీరు పోసేందుకు వీలుగా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా కేసీఆర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో..?