Begin typing your search above and press return to search.

కారులో అభ్యర్ధులను మార్చాల్సిందేనా!?

By:  Tupaki Desk   |   2 Nov 2018 5:41 AM GMT
కారులో అభ్యర్ధులను మార్చాల్సిందేనా!?
X
తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్మథనం ప్రారంభమైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్ధుల పట్ల వస్తున్న వ్యతిరేకత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రకటించిన స్ధానాల్లో దాదాపు సగం మందిని మార్చాల్సిందేనని సీనియర్ నేతల నుంచి సలహాలు - సూచనలు వస్తున్నాయంటున్నారు. అసంత్రప్తులతోను - అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారితోనూ సంప్రదింపులు - బుజ్జగింపులు చేస్తున్న వారంతా లోలోపల పార్టీకి - ముఖ్యంగా అభ్యర్ధులకు వ్యతిరేకంగానే పని చేస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. మరోవైపు మహాకూటమి కూడా శరవేగంగా పావులు కదుపుతూండడంతో అభ్యర్ధుల్లో కొందరిని మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితిలో పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్లు చెబుతున్నారు. అభ్యర్ధులను ప్రకటించిన నాటి పరిస్థితి నేడు లేదని - అంతా సర్దుకుపోతుందని అనుకున్నా ఆ జాడలు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో తప్పనిసరిగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తప్పదంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు అభ్యర్ధులతో నేరుగా ఫోన్‌ లో సంప్రదింపులు జరుపుతున్నారని, వారిలో నిరాశ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహాకూటమి అభ్యర్ధుల ప్రకటన తర్వాత కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి అభ్చర్ధులను మారిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతన్నట్లు చెబుతున్నారు. అసంత్రప్తులను బుజ్జగించే పనిని తన కుమారుడు - మంత్రి కె.తారక రామారావుకు అప్పగించారు కె.చంద్రశేఖర రావు.అయితే అది ఆయన ఆశించిన స్ధాయిలో ఫలితం ఇవ్వలేదంటున్నారు. అసంత్రప్తులను బుజ్జగించడం కంటే వారిని బెదిరించే స్ధాయిలోనే కె.తారక రామారావు మాట్లాడారని - దీంతో వారంతా ఎదురుతిరుగుతున్నారని ప్రగతి భవన్‌ కు నివేదికలు వస్తున్నట్లు సమాచారం. టిక్కట్టు రాని వారు తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని - పైకి చిరునవ్వులు చిందిస్తున్నా లోలోపల మాత్రం మహాకూటమి విజయానికే వారు పని చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాకపోతే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే భరోసా కూడా వారిలో కలుగుతోందంటున్నారు. అభ్యర్ధులను ప్రకటించినప్పుడు ఉన్న పరిస్ధితి రోజురోజుకు దిగజారుతోందని - ముందే చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయంటున్నారు.