Begin typing your search above and press return to search.

ఇదే నిజ‌మైతే.. కేసీఆర్‌ కు పోలీసులు ఫిదా!

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:30 AM GMT
ఇదే నిజ‌మైతే.. కేసీఆర్‌ కు పోలీసులు ఫిదా!
X
వినూత్న నిర్ణ‌యాలు తీసుకోవ‌టం కేసీఆర్ స‌ర్కారుకు మామూలే. త‌న నిర్ణ‌యాల‌తో యావ‌త్ దేశాన్ని త‌న‌వైపు తిప్పుకునే నేర్పు.. కేంద్రం మొద‌లు ప‌లు రాష్ట్రాల వారు తెలంగాణ స్టేట్‌ లో అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాలు.. తీసుకునే నిర్ణ‌యాల మీద ఒక క‌న్నేయ‌టం ఈ మ‌ధ్య‌న అల‌వాటుగా మారింది. త‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి పోలీసుల‌కు పెద్ద పీట వేయ‌టంతో పాటు.. ఏళ్ల‌కు ఏళ్లుగా ఉన్న త‌మ క‌ష్టాల‌పై కేసీఆర్ స్పందిస్తున్న తీరును ప‌లువురు ప్ర‌శ‌సింస్తుంటారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులంతా మ‌స్తు ఖుషీ అయ్యేలా కేసీఆర్ స‌ర్కార్ ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. రాత్రి.. ప‌గ‌లు అన్న తేడా లేకుండా ప‌ని చేసే పోలీసుకు కాసింత విశ్రాంతితో పాటు.. వారి క‌ష్టాల్ని పూర్తిగా అర్థం చేసుకున్న‌ట్లుగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై వ‌చ్చిన క‌థ‌నం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తెలంగాణ పోలీసుల మొత్తం క‌ష్టాల్ని ఒక్క నిర్ణ‌యంతో మార్చేయాల‌న్న యోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కాలంతో సంబంధం లేకుండా డ్యూటీ చేసే పోలీసుల‌కు రోజుకు 8 గంట‌ల మాత్ర‌మే ప‌ని చేసేలా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో టీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. షిఫ్ట్ ప‌ద్ద‌తిని పోలీసింగ్ లో తీసుకురావాల‌ని.. నిర్దిష్ట స‌మ‌యానికి మించి ప‌ని చేసిన వారికి అద‌నంగా అల‌వెన్సులు ఇవ్వాల‌ని.. వీక్లీఆఫ్ లు.. ఇన్సెంటివ్ లు ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఇందుకోసం భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ అవ‌స‌రం. పోలీసుల‌ ప‌ని తీరు మొత్తాన్ని మార్చేసి.. సరికొత్త పోలీసింగ్ తో మ‌రింత ఎఫెక్టివ్ గా ప‌ని చేయించ‌ట‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా చెబుతున్నారు. రోజుకు 8 గంట‌ల చొప్పున‌.. షిఫ్ట్ సిస్ట‌మ్ లో ప‌ని చేయ‌టానికి ఎంత‌మంది సిబ్బంది అవ‌స‌ర‌మ‌న్న లెక్క‌లు వేయాల‌ని పోలీసు శాఖ‌ను ప్ర‌భుత్వం కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక వ్య‌క్తి సెల‌వు లేకుండా గ‌రిష్ఠంగా 12 రోజులు మాత్ర‌మే ప‌ని చేస్తార‌ని.. ఆ త‌ర్వాత నుంచి ఆశించినంత‌గా ఫ‌లితాలు రాబ‌ట్ట‌టం క‌ష్ట‌మ‌ని.. ఇదంతా ఒక అంత‌ర్జాతీయంగా జ‌రిపిన స‌ర్వే వెల్ల‌డించిన విష‌యంగా ప్ర‌స్తావించిన ఒక పోలీసు ఉన్న‌తాధికారి.. పోలీసుల నుంచి మ‌రింత ప‌ని తీరు ఆశించాలంటే.. వారికి అవ‌స‌ర‌మైన విశ్రాంతిని ఇవ్వాల్సిన అవస‌రం ఉంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటినుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 10 వేల మంది ఎస్సూ.. కానిస్టేబుళ్ల స్థాయిలో రిక్రూట్ మెంట్ జ‌రిగింద‌ని.. మ‌రో 18 వేల పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో 12 వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది.

పోలీసుల ప‌ని తీరును మ‌రింత పెంచేందుకు వీలుగా షిఫ్ట్ సిస్ట‌మ్ కానీ అమ‌లైతే.. తెలంగాణ పోలీసులు మ‌స్తు ఖుషీ కావ‌టం ఖాయం. అదే స‌మ‌యంలో.. ఇత‌ర రాష్ట్రాల్లోని పోలీసులు అసూయ ప‌డ‌టం ప‌క్కా. వినూత్నంగా ఆలోచించ‌టం.. సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తోపాటు.. తాము అమ‌లు చేసే విధానాల్ని దేశం మొత్తం అమ‌లు చేసేలా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ త‌న మార్క్ ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించ‌నున్నారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.