Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 Aug 2018 5:05 AM GMT
సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా కేసీఆర్?
X
సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకునేందుకు వీలుగా భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నారా? అంటే.. అవున‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ముంద‌స్తుకు సిద్ధ‌మా? అంటూ ఈ మ‌ధ్య‌న కాంగ్రెస్ కు స‌వాల్ విసిరిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆ దిశ‌గా ఆలోచించ‌ట‌మే కాదు.. ఒక‌ట్రెండు అడుగులు ముందుకు వేసిన‌ట్లుగా తెలుస్తోంది.

డిసెంబ‌రులో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన నేప‌థ్యంలో.. ఈ జాబితాలో తెలంగాణను కూడా చేర్చాల‌న్న దిశ‌గా కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ క‌స‌ర‌త్తులో భాగంగానే ప్ర‌ధాని మోడీతో త‌ర‌చూ భేటీలు అవుతున్న‌ట్లు స‌మాచారం. ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాలు.. పార్ల‌మెంటులో వివిధ పార్టీల నేత‌ల మ‌ధ్య న‌డుస్తున్న చ‌ర్చ‌ను ఒక కొలిక్కి తీసుకొస్తే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగే ఎన్నిక‌ల స‌మ‌యంలోనే.. తాము కూడా ఎన్నిక‌ల‌కు వెళితే భారీ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

సాంకేతికంగా చూస్తే.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కూ కేసీఆర్ ప్ర‌భుత్వానికి గ‌డువు ఉంది. అయితే.. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో క‌లిసి వెళితే పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. అందుకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్ని విడిగా నిర్వ‌హిస్తే అది త‌మ‌కు పూర్తి అనుకూలంగా ఉండ‌ట‌మే కాదు.. త‌న ఫ్యూచ‌ర్ ప్లానింగ్ కు త‌గ్గ‌ట్లు ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి అనుకూలంగా ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

కొద్ది రోజుల క్రితం మోడీ స‌ర్కారు జ‌మిలి ఎన్నిక‌ల మీద క‌స‌ర‌త్తు చేసి.. వెన‌క్కి త‌గ్గటం తెలిసిందే.ఈ సంద‌ర్భంలోనే కేసీఆర్ కు ముంద‌స్తుకు వెళితే మంచిద‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన కొద్ది నెల‌లుగా ఈ అంశంపై తీవ్ర‌స్థాయిలో మ‌థ‌నం సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. లోక్ స‌భ‌.. అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి జరిగితే ఎదుర‌య్యే ప్ర‌తికూల‌త‌ల‌పై మ‌దింపు చేసిన కేసీఆర్‌.. డిసెంబ‌రులో ముంద‌స్తుకు వెళ్ల‌ట‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌కు ఫైన‌ల్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

డిసెంబ‌రులో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ద్వారా.. త‌మ ప‌థ‌కాల‌పై ఉన్న పాజిటివ్ ఓటుతో తేలిగ్గా బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాదు.. భారీ మెజార్టీ త‌మ సొంత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో.. షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎజెండా వేరుగా ఉండ‌టంతో పాటు.. త‌న ర‌హ‌స్య స్నేహితుడు మోడీకి సానుకూలంగా ఉండేలా తాము అత్య‌ధిక సీట్లు సొంతం చేసుకోవ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

డిసెంబ‌రులో ఎన్నిక‌ల‌కు వెళ్లే అంశంపై ప్ర‌ధాని మోడీని క‌లిసిన కేసీఆర్‌.. ఈ విష‌యంపై ఆయ‌న్ను క‌న్వీన్స్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా ప్ర‌ధాని మోడీతో త‌ర‌చూ భేటీ అవుతున్న కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల మీద లోతుగా చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ విజ‌య‌వ‌కాశాల‌ను చెప్ప‌ట‌మే కాదు.. అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్ని వేర్వేరుగా నిర్వ‌హించ‌టం వ‌ల్ల‌.. బీజేపీకి భ‌విష్య‌త్తులో తాము మ‌ద్ద‌తు ప‌లికేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్న మాట‌ను మోడీకి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ క‌స‌ర‌త్తులో భాగంగానే ప‌లు ప‌థ‌కాల్ని వ‌రుస పెట్టి ప్ర‌క‌టించ‌టంతో పాటు.. ఈ ఆగ‌స్టు 15న మ‌రిన్ని ప‌థ‌కాల్ని వెల్ల‌డిస్తార‌ని భావిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో ప‌లువురు ఎంపీల మ‌ధ్య విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌టం చూస్తే.. అసెంబ్లీ ర‌ద్దు దిశ‌గా కేసీఆర్ పావులు కుదుపుతున్న సందేహం రాక మాన‌దు. అక్టోబ‌రులో స‌భ‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంటే డిసెంబ‌రులో ఎన్నిక‌లు జ‌రిగే వీలుంది. అదే జ‌రిగితే.. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా సానుకూల ప‌రిణామాలు ఉంటాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

తాము ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. అవ‌న్నీ వ‌దంతులేన‌ని టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంటు లాబీల్లో కొట్టి పారేస్తున్నారు. అయితే.. పార్టీలో ముంద‌స్తు ఎన్నిక‌ల మీద చ‌ర్చ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్ప‌టం గ‌మ‌నార్హం. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వేరుగా వెళితే త‌మ మ‌ద్ద‌తు టీఆర్ఎస్ కు ఇస్తామ‌ని మ‌జ్లిస్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగితే మాత్రం త‌మ మ‌ద్ద‌తు కాంగ్రెస్ కు ఇస్తామ‌ని అస‌దుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీకి ర‌హ‌స్య మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న టీఆర్ఎస్ కు తాము మద్ద‌తు ఇస్తే.. జాతీయ స్థాయిలో బ‌ద్నాం అవుతామ‌ని అస‌ద్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ర‌ద్దుపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.