Begin typing your search above and press return to search.

అంబర్ పేటలో అన్ని పెండింగ్ లో ఎందుకు పెట్టారు?

By:  Tupaki Desk   |   19 Nov 2020 7:50 AM GMT
అంబర్ పేటలో అన్ని పెండింగ్ లో ఎందుకు పెట్టారు?
X
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎవరన్న విషయంపై నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. మొత్తం 150 స్థానాలకు తెలంగాణ అధికారపక్షం పోటీ చేస్తున్నా.. వారి ఫోకస్ అంతా 105 స్థానాల మీదనే. మిగిలిన 45 స్థానాలు మిత్రుడు మజ్లిస్ తో స్నేహపూర్వక పోటీ ఉంటుంది. పేరుకు పోటీనే కాదు.. గెలుపు మజ్లిస్ కే ఉంటుందన్నది నిజం. అందుకు తగ్గట్లే.. అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని చెబుతారు.

తన తొలి జాబితాలో 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్.. 45 మంది అభ్యర్థుల స్థానాలకు ఖరారు చేయలేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మజ్లిస్ గెలుపొందిన 44 స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని విడవకుండా అన్నింటిలోనూ అభ్యర్థుల్ని ఖరారు చేసిన టీఆర్ఎస్.. పెండింగ్ లో పెట్టిన డివిజన్లకు సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబర్ పేట నియోజకవర్గంలోని ఏ డివిజన్ కు అభ్యర్థిని ఎంపిక చేయకపోవటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఉప్పల్ నియోజకవర్గంలోని డివిజన్లలోనూ ఎక్కువ స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయలేదు.

ఎందుకిలా? అంటే.. దాని వెనుక భారీ వ్యూహం ఉందని చెబుతున్నారు. అంబర్ పేట నియోజకవర్గం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ డివిజన్ కూడా చేజారిపోకూడదన్న లక్ష్యంతోనే పెండింగ్ లో ఉంచినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు బలంగా చెబుతున్న వేళ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గం పరిధిలోని ఐదు డివిజన్లను తామే సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో తెలంగాణ అధినాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సతీమణి పద్మ పేరు కూడా తొలి జాబితాలో లేకపోవటం విశేషం. అంబర్ పేట పరిధిలోని ఐదు డివిజన్లలో ఒక్కటి కూడా బీజేపీకి దక్కుండా చేయటం ద్వారా.. బీజేపీకి బలమైన పంచ్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అత్యధిక డివిజన్లకు అభ్యర్థుల్ని ఎంపిక చేయకపోవటం గమనార్హం. కొన్ని డివిజన్లలో బీజేపీ బలంగా ఉండటం.. కొన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని మార్చాల్సి రావటంతో.. వ్యూహాత్మకంగానే అభ్యర్థుల్ని ప్రకటించలేదని చెబుతున్నారు.